బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతు ఇవ్వండి.. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయితో మంత్రి లోకేశ్‌

  • టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి
  • మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలు ఇవ్వాల‌న్న మంత్రి
  • యువ నిపుణుల కెరీర్ డెవల‌ప్‌మెంట్ కోసం మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాల‌ని విజ్ఞ‌ప్తి
పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాల‌న్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల‌ని కోరారు. 

మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలివ్వండి..
మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామ‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తరపున కార్యక్రమాలను రూపొందించాల‌న్నారు. లింగ వైవిధ్యం సంస్థాగత విజయాన్ని ఎలా మెరుగుపరుస్తుందో చర్చించాల‌ని పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్‌నెస్‌ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సి ఉంద‌న్నారు. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వరంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాల‌ని పేర్కొన్నారు. 

బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతునివ్వండి..
విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంద‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా యువ నిపుణులు వారి కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాల‌ని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడటానికి త‌మ‌ రాష్ట్రాన్నిసందర్శించాల‌న్నారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతు ఇవ్వాల‌ని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. లోకేశ్‌ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందిస్తూ ఏపీలో పెట్టుబడుల రాబడికి తమవంతు సహకారం అందిస్తానని అన్నారు.



More Telugu News