డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన హోంమంత్రి అనిత

  • పలు అంశాలపై పవన్, అనిత చర్చలు
  • దీపావళి, ఏపీలో శాంతిభద్రతలు, డయేరియా, బాంబు బెదిరింపులపై చర్చ
  • పవన్ అడిగిన వాటికి వివరాలు తెలియజేసిన అనిత
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. దీపావళి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏపీలో శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లు, విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా పరిస్థితులు, ఏపీలోనూ విమానాలకు, హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం తదితర అంశాలపై పవన్ తో అనిత చర్చించారు. 

దీపావళి సందర్భంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున... 185 అగ్నిమాపక కేంద్రాలను అప్రమత్తం చేసినట్టు అనిత... పవన్ కు తెలియజేశారు. బాణసంచా అక్రమ తయారీపై 100, 101 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా పోలీస్, ఫైర్ విభాగాలకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ... పర్యావరణానికి హాని కలిగించని బాణసంచాతో దీపావళి జరుపుకోవాలని అన్నారు. కోనసీమ జిల్లా మండపేట మండలంలో దీపావళి టపాసుల పేలుడు ఘటన వంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, గుర్ల గ్రామంలో డయేరియా అదుపులోకి వచ్చిందా? అని హోంమంత్రి అనితను అడిగి పవన్ వివరాలు తెలుసుకున్నారు.


More Telugu News