అజిత్ పవార్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన శరద్ పవార్

  • పదవి కోసం కుటుంబాన్ని చీల్చారని తీవ్ర విమర్శలు
  • కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించారని ఆగ్రహం
  • ఒక్కసారి పదవి లేకుంటే కుటుంబాన్ని, పార్టీని చీలుస్తారా? అని నిలదీత
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవి కోసం కుటుంబాన్ని చీల్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. బారామతిలో ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి యుగేంద్ర పవార్ తరఫున ప్రచారంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ... కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించారన్నారు.

కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం తల్లిదండ్రులు, సోదరులు ఎప్పుడూ తనకు నేర్పించలేదన్నారు. అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్ సహా సోదరులందరితోనూ కలిసి మెలిసి కుటుంబంగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తన సోదరుల సహకారంతోనే పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టామన్నారు. పిల్లల పట్ల ఎప్పుడూ వివక్ష చూపించలేదన్నారు.

పార్టీలోని పలువురు నేతలకు ఉన్నత పదవులు ఇచ్చినప్పటికీ తన కుమార్తె సుప్రియా సూలేకు ఒక్క పదవి కూడా అప్పగించలేదన్నారు. తాను స్థాపించిన ఎన్సీపీ పార్టీ తనకు కాకుండా చేశారని, కోర్టుకు కూడా లాగారని వాపోయారు. నాలుగుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్‌కు పదవిపై కాంక్ష తగ్గలేదని ధ్వజమెత్తారు. ఒక్కసారి పదవి లేకుంటే కుటుంబాన్ని, పార్టీని చీలుస్తారా? అని ధ్వజమెత్తారు. వారే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, నేనే చేసినట్లుగా అజిత్ పవార్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

చాలాకాలం క్రితమే మహారాష్ట్రను ముందుకు నడిపించే బాధ్యతను ప్రజలు తనకు అప్పగించారన్నారు. ప్రస్తుతం తాను మర్గదర్శకుడిగా మాత్రమే ఉంటూ కొత్త తరానికి పార్టీ వ్యవహారాలు అప్పగించానన్నారు. 


More Telugu News