రేవంత్ రెడ్డిని క్షమించమని దేవుడిని వేడుకుంటే... కేసులు పెట్టారు: హరీశ్ రావు

  • పాలకుడు దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పితే అరిష్టమని దేవుడికి మొక్కానన్న హరీశ్ రావు
  • ఎనుముల రేవంత్ రెడ్డి కాదు... ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా
  • హామీలపై ప్రశ్నించినందుకు బేగంబజార్ పీఎస్‌లో కేసు పెట్టారని విమర్శ
రేవంత్ రెడ్డిని క్షమించమని తాను దేవుడిని వేడుకున్నానని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పాలకుడు దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టమవుతుందని భావించి తానే దేవుడి వద్దకు వెళ్లానని... ప్రజలను కాపాడు... పాపాత్ముడిని క్షమించమని వేడుకున్నానని చెప్పారు. అలా మొక్కినందుకు కూడా తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు.

ప్రజలను మోసం చేసినందుకు ఆయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదని... ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి పది నెలలైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు తనపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారని మండిపడ్డారు. "బిడ్డా రేవంత్ రెడ్డీ.. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టినా.. నీ హామీలు అమలయ్యే దాకా ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాను. బేగంబజార్‌లోనే కాదు... ఏ బజార్‌లో కేసులు పెట్టుకుంటావో పెట్టుకో" అన్నారు.

మూసీ పేరిట రూ.1.50 లక్షల కోట్లు అంటున్నారని, కానీ రైతుబంధు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతుబంధు, రుణమాఫీ, బీమా పేరిట కేసీఆర్ రూ.1.50 లక్షల కోట్లు రైతులకు ఇచ్చాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి హామీల పేరుతో మోసం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు కూడా అక్రమ కేసులు పెడుతూ అతిగా వ్యవహరిస్తున్నారని... వారి పేర్లు డైరీలో రాసి పెడుతున్నామని హెచ్చరించారు.


More Telugu News