కపిల్ దేవ్ ను కలవడం ఎంతో సంతోషం కలిగించింది: ఏపీ సీఎం చంద్రబాబు

  • ఇవాళ ఉండవల్లి వచ్చిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్
  • సీఎం చంద్రబాబుతో ఆసక్తికర సమావేశం
  • అమరావతిలో గోల్ఫ్ కోర్స్ పై చర్చించామన్న సీఎం చంద్రబాబు
  • ఏపీని నికార్సయిన స్పోర్ట్స్ హబ్ గా తయారుచేస్తామని వెల్లడి 
భారత క్రికెట్ ఆణిముత్యం కపిల్ దేవ్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లి వచ్చిన కపిల్ దేవ్ కు సీఎం చంద్రబాబు హార్దికస్వాగతం పలికారు. కపిల్ తో భేటీపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

"మన దిగ్గజ క్రికెటర్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్ ను, ఆయన బృందాన్ని కలవడం సంతోషం కలిగించింది. ఏపీలో క్రీడా రంగ విస్తరణపై చర్చించాం. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్, గోల్ఫ్ క్లబ్, అనంతపూర్, విశాఖలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్ ల ఏర్పాటు గురించి మాట్లాడుకున్నాం. యువతలో గోల్ఫ్ పట్ల ఆసక్తి కలగడానికి, నెక్ట్స్ జనరేషన్ గోల్ఫర్లు తయారుకావడానికి ఈ చర్యలు ఊతమిస్తాయని భావిస్తున్నాం. 

రాష్ట్రవ్యాప్తంగా పౌరులకు మరింత మెరుగైన అవకాశాలు, సదుపాయాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఏపీని నికార్సయిన స్పోర్ట్స్ హబ్ గా మలిచేందుకు కపిల్ దేవ్ వంటి క్రీడా రంగ దిగ్గజాలతో కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటాం" అని చంద్రబాబు వివరించారు.


More Telugu News