తూర్పు లడఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తి!

  • ఉపసంహరణ ప్రక్రియ దాదాపు ముగిసిందన్న ఆర్మీ వర్గాలు
  • ఒకరి స్థావరాలను ఒకరు తనిఖీ చేసుకుంటున్నట్టు వెల్లడి
  • బలగాల ఉపసంహరణకు గత వారమే ఒప్పందం కుదుర్చుకున్న భారత్-చైనా
తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి గత నాలుగేళ్లుగా నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకుతూ భారత్-చైనాల మధ్య గతవారం కీలక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ అంగీకారం ప్రకారం మూడు రోజుల క్రితం మొదలైన బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. 

తూర్పు లడఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలలో బలగాలు వెనక్కి మళ్లే ప్రక్రియ ముగిసినట్టేనని పేర్కొన్నాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని, మౌలిక సదుపాయాల తొలగింపులను కూడా ధృవీకరించుకుంటున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.

కాగా తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్, దళాల ఉపసంహరణకు భారత్ చైనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో గాల్వాన్ లోయలో ఇరు సేనల మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. ఈ ఒప్పందానికి ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఆమోదం తెలిపారు. రష్యా వేదికగా జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఇరువురూ హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News