బండి సంజయ్ తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రినని మర్చిపోయినట్టున్నారు: జగదీశ్ రెడ్డి

  • బండి సంజయ్... రేవంత్ రెడ్డికి సహాయమంత్రిలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • రేవంత్ రెడ్డిని కాపాడాలనే తాపత్రయమే కనిపిస్తోందని వ్యాఖ్య
  • రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీ చేసుకుంటే పోలీసులు తప్పుడు కేసు పెట్టారని మండిపాటు
బండి సంజయ్ ఈ మధ్యకాలంలో తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని అని, బీజేపీ నేతను అని మరిచిపోయి మాట్లాడుతున్నారని... కేవలం సీఎం రేవంత్ రెడ్డికి సహాయమంత్రిగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిని కాపాడాలనే తాపత్రయం బండి సంజయ్‌లో ఎక్కువగా కనిపిస్తోందన్నారు. అదే సమయంలో కేటీఆర్ పై, బీఆర్ఎస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు.

వాస్తవానికి రెండు జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య వైరం ఉంటుందని, కానీ తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. మేం (బీఆర్ఎస్) అధికారంలో ఉన్నప్పుడు అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయంటే సరే అనుకోవచ్చు... కానీ ఇప్పుడు కూడా కలవడం ఏమిటన్నారు. 

ఢిల్లీలో మోదీకి, రాహుల్ గాంధీకి ప్రతిరోజూ యుద్ధం సాగుతోందని, కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బండి సంజయ్ ఉత్సాహపడుతున్నారని ఆరోపించారు. ఎంత మభ్యపెట్టాలని ప్రయత్నించినా... రేవంత్, బండి సంజయ్ కలిసి పనిచేస్తున్నారనే విషయాన్ని దాచలేరన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి వారి ఐక్యతను నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సీఎంను కాపాడేందుకు బండి సంజయ్ కరీంనగర్ కార్పోరేటర్ స్థాయికి దిగజారి మాట్లాడటం శోచనీయమన్నారు. బండి సంజయ్ తన స్థాయికి తగినట్లుగా మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తామనడం ఏమిటని నిలదీశారు. ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారా?లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఆలోచించుకోవాలన్నారు. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీ చేసుకుంటే పోలీసులను ఉలిగొల్పి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.


More Telugu News