అమితాబ్ బచ్చన్ దగ్గర అప్పు తీసుకున్న రతన్ టాటా

  • ఒకసారి లండన్‌ విమానాశ్రయంలో రతన్ టాటాను రిసీవ్ చేసుకునేందుకు రాని సహాయకులు
  • ఫోన్‌కాల్ చేసేందుకు డబ్బులు లేక అమితాబ్‌ను అప్పు అడిగిన వ్యాపార దిగ్గజం
  • మరోసారి కారులో ఇంటి వద్ద దించాలని స్నేహితుడిని కోరారన్న బిగ్ బీ
  • కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్న బాలీవుడ్ దిగ్గజం
జీవితాంతం విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించి భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన ఎంత సామాన్యుడిలా గడిపారో తెలియజేసే రెండు ఆసక్తికరమైన సందర్భాలను బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వెల్లడించారు.

రతన్ టాటా చాలా సాధారణ మనిషి అని, ఎంతో గొప్ప వ్యక్తి అని అమితాబ్ కొనియాడారు. ‘‘ఒకసారి నేనూ, రతన్ టాటా ఒకే విమానంలో లండన్‌ ప్రయాణించాం. హీత్రో విమానాశ్రయంలో దిగిన తర్వాత తన కోసం సహాయకులు ఎవరూ రాలేదని టాటా గ్రహించారు. ఫోన్ కాల్ చేసేందుకు బూత్‌లోకి వెళ్లారు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. కొద్దిసేపటికే ఫోన్‌బూత్‌లోంచి టాటా బయటకు వచ్చారు. నా దగ్గరికి వచ్చి అమితాబ్ మీ దగ్గర నేను కొంత డబ్బు అప్పు తీసుకోవచ్చా అని అడిగారు. ఫోన్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నారు. ఆయన మాటలు నేను నమ్మలేకపోయాను’’ అని అమితాబ్ బచ్చన్ వివరించారు. 

ఇక రతన్ టాటా నిరాడంబర వ్యక్తి అని, ఆయన సాదాసీదా జీవితాన్ని చూసి స్నేహితులు సైతం ఆశ్చర్యపోతుంటారని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఓ స్నేహితుడి ద్వారా తనకు తెలిసిన విషయాన్ని పంచుకుంటానంటూ మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ‘‘ఒక ఈవెంట్‌కు రతన్ టాటాతో పాటు ఆయన స్నేహితుడు ఒకరు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నన్ను మా ఇంటి దగ్గర దింపగలవా అని స్నేహితుడిని అడిగారు. నా దగ్గర కారు లేదు. మీ ఇంటి వెనుకాలే మా ఇల్లు అని రతన్ టాటా చెప్పారట. దీంతో ఆ స్నేహితుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. అంత సంపన్నుడి నుంచి ఇలాంటివి ఊహించగలమా..!? ఎంత ఆశ్చర్యం!!’’ అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.

కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16లో ఓ ఎపిసోడ్‌లో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సినీ నిర్మాత ఫరా ఖాన్, నటుడు బోమన్ ఇరానీ అతిథులుగా వచ్చారు. కాగా రతన్ టాటా, అమితాబ్ మధ్య వృత్తిపరమైన సంబంధం కూడా ఉంది. టాటా గ్రూపునకు చెందిన నిర్మాణ సంస్థ ‘టాటా ఇన్ఫోమీడియా లిమిటెడ్’ అమితాబ్‌తో 2004లో ‘ఐత్‌బార్’ అనే సినిమాను నిర్మించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. టాటా గ్రూప్‌కు సుమారు రూ.3.5 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.


More Telugu News