రూ. 8 కోట్ల కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపి.. 800 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసిన భార్య

  • ఈ నెల 1న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో వ్యాపారవేత్త రమేశ్‌ గొంతు కోసి హత్య చేసిన భార్య, ప్రియుడు
  • ఆ తర్వాత 800 కి.మీ. ప్రయాణించి కొడగులోని కాఫీ ఎస్టేట్‌లో మృతదేహాన్ని పడేసి నిప్పు
  • 500 సీసీటీవీలు పరిశీలించి కేసును ఛేదించిన పోలీసులు
  • రమేశ్ భార్య, ఆమె ప్రియుడు, మరో నిందితుడి అరెస్ట్
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని కాఫీ తోటలో మూడు వారాల క్రితం పోలీసులు ఓ వ్యక్తి కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడిని 54 ఏళ్ల వ్యాపారవేత్త రమేశ్‌గా గుర్తించారు. ప్రియుడు నిఖిల్, మరో నిందితుడు అంకుర్ తో కలిసి ఆయన భార్య నిహారికే అతడిని దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు. డబ్బు కోసం హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని పడేసేందుకు రాష్ట్ర సరిహద్దుల వెంట ప్రయాణించినట్టు పోలీసులు తెలిపారు. 

తెలంగాణలో రిజిస్టర్ అయిన కారు
కొడుగులోని సున్తికొప్ప సమీపంలోని కాఫీ తోటలో ఈ నెల 8న పోలీసులు కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారడంతో ఆ ప్రాంతం గుండా వెళ్లిన వాహనాల గురించి తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఎరుపు మెర్సెడెస్ బెంజ్ కారు వారిని ఆకర్షించింది. ఆ కారు రమేశ్ పేరున రిజిస్టర్ అయి ఉంది. ఆయన భార్య ఇటీవలే తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు తెలంగాణలో రిజిస్టర్ కావడంతో అక్కడి పోలీసులను కర్ణాటక పోలీసులు వాకబు చేశారు. ఈ క్రమంలో రమేశ్ భార్య నిహారిక (29)ను అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియుడు నిఖిల్, మరో నిందితుడు అంకుర్‌తో కలిసి తానే భర్తను హత్య చేసినట్టు ఆమె అంగీకరించింది.

చిన్నప్పటి నుంచీ కష్టాలే
నిందితురాలు నిహారిక చిన్నప్పటి నుంచీ కష్టాలు అనుభవించింది. ఆమె 16 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్లి చేసుకుంది. చదువులో రాణించిన నిహారిక ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భర్తతో విడిపోయింది. హర్యానాలో ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడి అక్కడ జైలు శిక్ష కూడా అనుభవించింది. అక్కడి జైలులోనే ఆమెకు అంకుర్ పరిచయమయ్యాడు. 
 
హత్యకు అసలు కారణం
హర్యానాలో జైలు నుంచి విడుదలయ్యాక వ్యాపారవేత్త అయిన రమేశ్‌ను నిహారిక రెండో పెళ్లి చేసుకుంది. అతడికి కూడా ఇది రెండో వివాహమే. అతడిని పెళ్లి చేసుకున్నాక ఆమె ఖరీదైన జీవితం అనుభవించింది. ఈ క్రమంలో ఒక రోజు తనకు రూ. 8 కోట్లు కావాలని భర్తను అడిగింది. ఇంత పెద్దమొత్తంతో అవసరాలు ఏముంటాయంటూ ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకుని, ఆస్తిని సొంతం చేసుకోవాలని భావించింది. ఇందుకు తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న నిఖిల్, అంకుర్‌ను వినియోగించుకుంది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో హత్య
రమేశ్‌ను ఈ నెల 1న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నిందితులు గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకుని తిరిగి బెంగళూరు వెళ్లారు. ఆ తర్వాత కారులో పెట్రోలు పోయించుకుని కొడగు వెళ్లారు. మొత్తంగా ఉప్పల్ నుంచి 800 కిలోమీటర్లు మృతదేహంతోనే ప్రయాణించారు. అక్కడ మృతదేహానికి దుప్పటి చుట్టి కాఫీ ఎస్టేట్‌లో పడేసి నిప్పంటించారు. ఆ తర్వాత నిందితులు ముగ్గురూ కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ నిహారిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు 500 సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి, తెలంగాణ పోలీసుల సాయం తీసుకుని, సాంకేతిక ఆధారాలతో ఛేదించారు.  


More Telugu News