కేరళ ఆలయ వేడుకల్లో విషాదం.. బాణసంచా పేలి 154 మందికి గాయాలు.. తొక్కిసలాట

  • కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజూతంబళం వీరెర్కవు ఆలయంలో ఘటన
  • నిప్పు రవ్వలు ఎగసిపడి గదిలో నిల్వచేసిన బాణసంచాకు మంటలు
  • భయంతో పరుగులు తీసిన భక్తులు
  • గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమం
కేరళ ఆలయ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా పేలి 154 మంది గాయపడ్డారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజూతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్ధరాత్రి జరిగిందీ ఘటన. సంప్రదాయ తెయ్యం పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయాన్ని సందర్శించారు. 

ఈ సందర్భంగా పేల్చిన టపాసుల రవ్వలు బాణసంచా నిల్వచేసిన గదిలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బాణసంచా ఒక్కసారిగా పేలడంతో భక్తులు భయంతో చెల్లాచెదురయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, నేటి రాత్రితో వేడుక ముగియాల్సి ఉండగా, అందుకోసం రూ. 25 వేల విలువైన తక్కువ తీవ్రత కలిగిన బాణసంచాను ఆలయ అధికారులు కొనుగోలు చేసి ఓ గదిలో భద్రపరిచారు.  

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఆలయ అధికారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News