అతి విశ్వాసం వల్లే న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడింది: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

  • టాప్ 3 బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరి నుంచైనా సెంచరీ ఉండాల్సిందన్న మాజీ క్రికెటర్
  • కివీస్ పేసర్లను కానీ... స్పిన్నర్లను కానీ టీమిండియా ఎదుర్కోలేకపోయిందని వ్యాఖ్య
  • కివీస్ కూడా ఈ గెలుపును ఊహించి ఉండదన్న బాసిత్ అలీ
న్యూజిలాండ్‌పై రెండో టెస్ట్‌లోనూ ఓటమిపాలై చాలాకాలం తర్వాత స్వదేశంలో సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌ తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి రెండింటిలోనూ భారత్ ఓడింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత బ్యాటర్లు 46 పరుగులకే ఆలౌట్ అయ్యారు. పుణేలో జరిగిన రెండో టెస్ట్‌లో 359 పరుగులు లక్ష్యాన్ని చేధించడంలో విఫలమయ్యారు.

భారత జట్టు ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శలు గుప్పించాడు. అతివిశ్వాసంతో ఆడటం వల్లే భారత్ ఓడిందన్నాడు. 350 ప్లస్ పరుగులను చేధించడం కష్టమేనని తాను మొదటే చెప్పానన్నాడు. టాప్ 3 బ్యాట్స్‌మన్‌లలో కనీసం ఒక్కరి నుంచైనా సెంచరీ ఉండాలన్నాడు. మొదటి టెస్టులో కివీస్ పేసర్లు 17 వికెట్లు తీస్తే, రెండో టెస్టులో స్పిన్నర్లు 19 వికెట్లు తీశారని గుర్తు చేశాడు. భారత ఆటగాళ్లు అటు పేసర్లను, ఇటు స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయినట్లుగా తెలుస్తోందన్నాడు.

బంగ్లాదేశ్‌పై టీమిండియా రెండు రోజుల్లోనే గెలిచిందని గుర్తు చేశాడు. శ్రీలంక చేతిలో 2-0తో ఓడిన న్యూజిలాండ్‌‌పై... తాము సునాయాసంగా గెలుస్తామని భారత క్రికెటర్లు మితిమీరిన విశ్వాసంతో ఉండి ఉంటారని బాసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ టీమ్ మాత్రం మంచి హోమ్ వర్క్ చేసిందన్నాడు. భారత్‌లో తాము గెలుస్తామని న్యూజిలాండ్ కూడా ఊహించి ఉండదన్నాడు. కానీ వారి హోమ్ వర్క్ ఫలించిందన్నాడు.


More Telugu News