ఇంగ్లీష్‌ ఛాన‌ల్ దాటే ప్ర‌య‌త్నంలో భార‌తీయుడి మృతి

  • ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో ప‌డ‌వ ప్ర‌మాదం
  • అదేస‌మ‌యంలో గుండుపోటు రావ‌డంతో మ‌ర‌ణం
  • ఈ ఏట ఇప్ప‌టికే 56కి చేరిన మ‌ర‌ణాలు
వ‌స‌ల‌దారుల‌తో క‌లిసి ఇంగ్లీష్ ఛాన‌ల్ దాటే క్ర‌మంలో ఓ భారతీయుడు (40) ప్రాణాలు కోల్పోయాడు. బోటు ప్ర‌మాదం కార‌ణంగా ఆ వ్యక్తి మ‌ర‌ణించాడు. ప్ర‌మాద స‌మ‌యంలో స‌ద‌రు వ్య‌క్తికి గుండెపోటు రావ‌డంతో... చికిత్స అందించిన‌ప్ప‌టికీ మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం ఉద‌యం ఉత్త‌ర ప్రాన్స్‌లో జ‌రిగిన‌ట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. 
 
ఇంగ్లీష్ ఛాన‌ల్‌లోని ఫ్రెంచ్ జ‌లాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ప్రభుత్వ సంస్థ ప్ర‌కారం.. చిన్న ప‌డ‌వ‌ల‌పై ఛాన‌ల్‌ను దాటేందుకు ప్ర‌య‌త్నించిన వ‌ల‌స‌దారుల‌కు ఈ సంవ‌త్స‌రం అత్యంత విషాదభరితంగా మిగిలిపోయింది. తాజాగా ఈ వ్య‌క్తి మ‌ర‌ణంతో ఈ ఏడాది మృతుల సంఖ్య 56కి చేరింది. 

ఉద‌యం 5:30 గంట‌ల స‌మ‌యంలో కొంత మంది వ‌ల‌స‌దారులు ఇంగ్లీష్ ఛాన‌ల్ దాటేందుకు టార్డిన్‌గెన్ న‌గ‌రం నుంచి చిన్న ప‌డ‌వ‌లో బ‌య‌ల్దేరారు. ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా ప‌డ‌వ ప్ర‌మాదానికి గురైంది. దీంతో వ‌ల‌స‌దారుల్లో కొంద‌రు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు.  వీరిలో కొంద‌రికి లైఫ్ జాకెట్లు సైతం లేవు. ఇదే స‌మ‌యంలో ఇండియాకి చెందిన వ్య‌క్తికి గుండెపోటు రావ‌డంతో చికిత్స అందించిన‌ప్ప‌టికీ మ‌ర‌ణించాడు. 

యూర‌ప్‌లో పెరుగుతున్న క‌ఠిన‌మైన వలస నియ‌మాలు, పెరుగుతున్న జెనోఫోబియా (విదేశీయుల పట్ల విద్వేషం) కార‌ణంగా వ‌స‌ల‌దారులు ఉత్త‌రం వైపు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. యూకే ప్ర‌భుత్వం వలసదారుల పట్ల కఠిన వైఖరితో ఉన్న‌ప్ప‌టికీ... చాలా మంది వ‌ల‌స‌దారులకు అక్క‌డ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండ‌టంతో పాటు మ‌రిన్ని అవ‌కాశాలు ల‌భిస్తాయ‌నే అభిప్రాయంతో వెళుతున్నారు.  



More Telugu News