మదర్ థెరిసా‌తో జరిగిన సంభాషణను తొలిసారి వెల్లడించిన ప్రియాంక గాంధీ

  • తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత థెరిసా తమ నివాసానికి వచ్చారన్న ప్రియాంక గాంధీ
  • బాధలో ఉన్నానని గ్రహించి తనతో కలిసి పనిచేయాలని కోరారని వెల్లడి
  • ఢిల్లీలో థెరిసా సిస్టర్స్‌తో కలిసి పనిచేసి పిల్లల బాధలు, ఇబ్బందులు తెలుకున్నానని వివరణ
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రచారంలో దూసుకెళుతున్నారు. విస్తృత ప్రచారంలో భాగంగా ఇవాళ (సోమవారం) ఆమె ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మదర్ థెరిసా ఒక రోజు తమ నివాసానికి వచ్చారని ప్రియాంక గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో థెరిస్సా చెప్పిన విషయాలను పంచుకున్నారు.

‘‘నాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మదర్ థెరిసా మా అమ్మను (సోనియా గాంధీ) కలవడానికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నేను నా గదిలో ఉన్నాను. థెరిసా నన్ను కలవడానికి రూమ్‌లోకి వచ్చారు. నా తలపై చేయి వేసి నా చేతిలో రోజరీ (శిలువ జపమాల) పెట్టారు. మా నాన్న చనిపోయిన నాటి నుంచి నేను బాధలోనే ఉన్న విషయాన్ని ఆమె గ్రహించి ఉండవచ్చు. నువ్వు వచ్చి నాతో కలిసి పని చేయమని ఆమె కోరారు. ఆమె ఆహ్వానం మేరకు నేను ఢిల్లీలోని మదర్ థెరిసా సిస్టర్స్‌తో కలిసి పనిచేశాను’’ అని ప్రియాంక గాంధీ చెప్పారు.

థెరిసాతో సంభాషణ గురించి తాను బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అని, ఇలా చెప్పడానికి సందర్భం వచ్చిందని ఆమె అన్నారు. ఢిల్లీలో థెరిసా సిస్టర్స్‌తో కలిసి బాత్‌రూమ్‌లు కడిగానని, పాత్రలు శుభ్రం చేశానని, పిల్లలకు కొంచెం ఇంగ్లీష్ నేర్పించడం లాంటి పనులు చేశానని ప్రస్తావించారు. పిల్లలకు నేర్పించడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం వంటి పనులు చేయడంతో పిల్లలు ఎదుర్కొన్న బాధలు, ఇబ్బందులు తెలుసుకున్నానని, సేవ చేయడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నానని ప్రియాంక గాంధీ చెప్పారు.

ఒక సంఘం ఎలా సాయం చేస్తుందో కూడా తాను గ్రహించానని అన్నారు. గత వారం ఒక మాజీ సైనికుడి ఇంటిని సందర్శించానని, వృద్ధురాలైన అతడి తల్లి థ్రెసియాతో మాట్లాడిన సమయంలో ఆమె చేతిలో కూడా రోజరీని ఉండడాన్ని చూశానని ప్రస్తావించారు. ప్రజల అవసరాలు ఏమిటో తాను అర్థం చేసుకోవడం మొదలుపెట్టానని, ఇది ప్రారంభం మాత్రమేనని, తాను వచ్చి అందరి నుంచి సమస్యలు వినాలనుకుంటున్నట్టు ప్రియాంక గాంధీ చెప్పారు. తన బాధ్యతలు ఏమిటో తాను అర్థం చేసుకోవాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. 

‘‘నా అన్నపై మీకున్న ప్రేమతో నా మాటలు కూడా వినడానికి మీరు వచ్చారని నాకు తెలుసు. నేను ఆయన చెల్లిని. మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు ఆయన హృదయం ఎంత బరువెక్కిందో నాకు తెలుసు. రాహుల్ గాంధీకి ధైర్యాన్ని ఇచ్చింది మీరే’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. కాగా నవంబర్ 13న వయనాడ్ ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితం వెలువడుతుంది.


More Telugu News