కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ బిగ్ షాక్!

  • జట్టు నుంచి రాహుల్‌ను రిలీజ్ చేసినట్టు సమాచారం
  • నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను రిటెయిన్ చేసుకున్న యాజమాన్యం!
  • కెప్టెన్ రేసులో ముందు వరుసలో ఉన్న నికోలస్ పూరన్
ఐపీఎల్ 2025లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ తరపున ఆడతాడా లేదా అనేది ఉత్కంఠను రేపుతోంది. రాహుల్‌ను రిలీజ్ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్టు చాలా రోజులుగా ఊహాగానాలు వెలుడుతున్నాయి. అయితే ఇటీవల యాజమాన్యంతో జరిగిన భేటీలో టీమ్‌లో కొనసాగడంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదంటూ రాహుల్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి మరో ఆసక్తికర కథనం వచ్చింది.

కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఎల్ఎస్‌జీ యాజమాన్యం విడుదల చేసిందంటూ జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. జట్టు రిటెయిన్ చేసుకోవాలని భావిస్తున్న ఆటగాళ్ల జాబితాలో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ ఉన్నారని సమాచారం. ఈ ముగ్గురితో పాటు పేసర్ మొహిసిన్ ఖాన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆయుష్ బదోనిలను కూడా నిలుపుదల చేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉన్న ఆటగాళ్లలో పూరన్ ముందు వరుసలో ఉంటాడని ఎల్‌ఎస్‌జీ వర్గాలు చెబుతున్నాయి.

పూరన్‌పై నమ్మకం ఉంచడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు ఎల్‌ఎస్‌జీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘గతేడాది కూడా కొన్ని మ్యాచ్‌లకు పూరన్ నాయకత్వం వహించాడు. జాతీయ జట్టుకు కూడా సారథిగా వ్యవహరించిన అపారమైన అనుభవం అతడికి ఉంది. అందుకే అతడి నైపుణ్యాలపై నమ్మకం ఉంచి కొనసాగుతాం. అతడితో పాటు పేసర్ మయాంక్ యాదవ్‌, రవి బిష్ణోయ్‌లను కొనసాగుతాం’’ అని ఫ్రాంచైజీకి చెందిన సన్నిహిత వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. నికోలస్ పూరన్ తక్కువ సమయంలో లక్నో జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. వికెట్ కీపర్ కూడా కావడం జట్టుకు కలిసొచ్చే అంశం.

కాగా 2023లో నిర్వహించిన మినీ ఐపీఎల్ వేలంలో పూరన్ ఏకంగా రూ.16 కోట్ల భారీ ధర పలికాడు. గతేడాది కేఎల్ రాహుల్ అందుబాటులో లేని సమయంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన పవర్-హిట్టింగ్‌తో అదరగొట్టాడు. దీంతో అతడు ప్రస్తుతం కీలక ఆటగాడిగా ఎదిగిపోయాడు. కాగా, ఆశ్చర్యకరంగా 2017లో ముంబై ఇండియన్స్‌ పూరన్‌ను కేవలం రూ.30 లక్షలకే సొంతం చేసుకుంది.


More Telugu News