టీమిండియాకు పొంచివున్న చెత్త రికార్డు... నాడు సచిన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడూ ఇలాగే..!

  • ముంబై టెస్టులోనూ న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఖాతాలో అవాంఛిత రికార్డు
  • స్వదేశంలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురయ్యే అవకాశం
  • చివరిసారిగా 1997లో శ్రీలంక చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో  భారత్ కోల్పోయింది. ఫలితంగా దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్‌ను చేజార్చుకుంది. 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్ట్ సిరీస్‌లు సాధించిన టీమిండియా విజయాల పరంపరకు న్యూజిలాండ్ ఆటగాళ్లు బ్రేక్ వేశారు. 

ఇక ముంబై వేదికగా జరగనున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు గెలిస్తే భారత్ ఖాతాలో ఒక అవాంఛిత రికార్డు చేరే అవకాశం ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా అవతరించేందుకు న్యూజిలాండ్‌‌కు అవకాశం ఉంది.

2000 సంవత్సరంలో స్వదేశంలో జరిగిన ఒక టెస్ట్ సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేకపోయింది. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో, బెంగళూరులో రెండవ టెస్టును ఇన్నింగ్స్, 71 పరుగుల తేడాతో పర్యాటక జట్టు గెలుచుకుంది. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఈ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ చేసిన నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా 250కిపైగా స్కోర్ చేయలేకపోయింది. భారత్‌పై అన్ని విధాలా ఆధిపత్యం చెలాయించిన దక్షిణాఫ్రికా జట్టు ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 479 పరుగుల భారీ స్కోరు సాధించింది.

0-3 తేడాతో వైట్‌వాష్ చేసిన శ్రీలంక
ఇక 1997లో టీమిండియాను శ్రీలంక 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. అప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నాడు. శ్రీలంక కెప్టెన్‌గా అర్జున్ రణతుంగ ఉన్నాడు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ముంబై వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోతే అవాంఛిత రికార్డు ఖాతాలో పడుతుంది. 

కాగా మూడవ టెస్టులో గెలుపు టీమిండియాకు చాలా కీలకమైనది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌ను గెలవాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.


More Telugu News