స్పిన్ ద్వయం అశ్విన్-జడేజాపై తీవ్ర విమర్శలు.. ప్రెస్‌మీట్‌లో రోహిత్‌శర్మ కీలక వ్యాఖ్యలు

  • స్పిన్‌కు సహకరించిన పూణె పిచ్‌పై రాణించలేకపోయిన దిగ్గజ స్పిన్నర్లు
  • ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు రాణించిన చోట దారుణంగా విఫలం
  • ఇద్దరూ పెద్ద మ్యాచ్ విన్నర్లంటూ సమర్థించిన రోహిత్
స్పిన్‌కు అనుకూలంగా ఉన్న చోటు, పైగా ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లతో పాటు తమ జూనియర్ వాషింగ్టన్ సుందర్ రాణించిన పూణె పిచ్‌పై స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. అశ్విన్ కాస్త మెరుగ్గా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు చొప్పున తీశాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై సత్తా చాటలేకపోవడం విమర్శలకు కారణమైంది. అయితే వీరిద్దరినీ కెప్టెన్ రోహిత్‌శర్మ వెనకేసుకొచ్చాడు.

వీరిద్దరూ పెద్ద మ్యాచ్ విన్నర్లు అని రోహిత్ సమర్థించాడు. మ్యాచ్‌లు గెలవడం సమష్టి బాధ్యత అని వ్యాఖ్యానించాడు. ‘‘ ఈ ఇద్దరు ఆటగాళ్లపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ వాళ్లు వికెట్లు తీయాలని ఆశిస్తున్నారు. అన్ని మ్యాచ్‌లు గెలిపిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా భావించడం సరికాదు. మ్యాచ్ గెలవడం అనేది మా అందరి బాధ్యత. కేవలం ఇద్దరు ఆటగాళ్లతోనే విజయాలు సాధ్యం కాదు కదా’’ అని వ్యాఖ్యానించాడు. 

ఏం చేయాలో, ఏం చేయకూడదో వారిద్దరికీ తెలుసని రోహిత్ సమర్థించాడు. నిజంగా వారేం సాధించారో తెలియదా? అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అశ్విన్, జడేజా చాలా క్రికెట్ ఆడారని, స్వదేశంలో 18 టెస్ట్ సిరీస్‌లు సాధించామని, దానికి వారి సహకారం ఉందని పేర్కొన్నాడు. గత విజయాల్లో వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషించారని గుర్తుచేశాడు. కాబట్టి వాళ్ళిద్దరినీ అంతగా పరిశీలించాల్సిన అవసరం లేదని రోహిత్ పేర్కొన్నాడు.

అశ్విన్ కంటే జడేజాపై ఎక్కువ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి జట్టులో జడేజాకు సరిసమానమైన ఆటగాడిగా భావిస్తున్న మిచెల్ సాంట్నర్ రాణించినప్పటికీ జడ్డూ ప్రభావం చూపకపోవడమే ఇందుకు కారణం.


More Telugu News