యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీలో పారిశ్రామిక పాలసీలు : అమెరికాలో మంత్రి లోకేశ్

  • అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు
  • డిసెంబర్ నుంచి అమరావతి  పనులు... 5 బిలియన్ డాలర్లతో క్యాపిటల్ రీజియన్ అభివృద్ధి
  • ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో యావియేషన్ వర్సిటీ, డాటా సెంటర్ ఏర్పాటు
  • శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ రౌండ్ టేబుల్ సమావేశం
అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఆరు పాలసీలను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని ప్రస్తావించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘  నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు మీ నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో దేశంలోనే 2వ అతిపెద్ద తీరప్రాంతం ఉంది. త్వరలో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయి. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25 శాతం ఏపీలోనే తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 శాతం ఏసీలు కూడా ఏపీలోనే తయారవుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం’’ అని అన్నారు.

డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని పనులు
కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజయన్‌లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణపనులు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ‘‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టిసారించాం. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రాబోతున్నాయి.  త్వరలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడీబీని పునరుద్దరించాం. రాజకీయంగా జాతీయ స్థాయిలో కీలకపాత్ర వహిస్తుండటం ఏపీకి కలసొస్తోంది. భారత్‌లో డేటా రెవెల్యూషన్ రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఏపీ కీలకపాత్ర పోషించబోతోంది. ప్రధాని మంత్రి మోదీ 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం వేగవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’ అని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి: శ్రీకర్ రెడ్డి
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేశ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో కాన్సులేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకుందని ప్రస్తావించారు.

కాగా ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి, ఫాల్కన్ ఎక్స్ కో ఫౌండర్ రాజు ఇందుకూరి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రావు సూరపనేని, ఏ5 కార్పొరేషన్ సీఈవో వినయ్ కృత్తివెంటి, అప్లయ్డ్ మెటీరియల్స్ సిటీఓ ఓం నలమాసు, పై డాటాసెంటర్ సీఈవో కల్యాణ్ ముప్పనేని, గ్లోబల్ ఇండస్ట్రీ ఎనలిస్ట్స్ సీఈవో రాంరెడ్డి,  ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హరి గక్కని, సురేషే మానుకొండ, వినోద్ బాబు ఉప్పు, వినయ్ పర్చూరి, రిఫిక్స్ ఏసీ సీఈవో అనిరుథ్ రెడ్డి, క్లియర్ స్టోన్ వెంచర్ డైరక్టర్ విష్ మిశ్రా, టీసీఎస్ బిజినెస్ యూనిట్ హెడ్ కేశవ్ వర్మ, నడ్జ్ ఏఐ సీఈవో సారీన్ షా, వెస్ట్ బ్రిడ్జి క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ రవి కన్నెగంటి, బాటా ప్రతినిధులు శ్రీమతి విజయ ఆసూరి, జయరామ్ కోమటి, సిలికానాంధ్ర ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభొట్ల, కార్యదర్శి రాజు చామర్తి, హాస్ బిజినెస్ స్కూల్ డైరక్టర్ ప్రొఫెసర్ సోలోమన్ డార్విన్, సోలిక్స్ టెక్నాలజీస్ సీఈవో సాయి గుండవల్లి, ఐసెరా కో ఫౌండర్, ముద్దు సుధాకర్, టాల్ హాస్పటల్స్ సీఈవో కిషోర్ గాదిరాజు, ఏపీ ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News