92 ఏళ్లలో తొలిసారి.. సరికొత్త రికార్డు సృష్టించిన యశస్వి జైస్వాల్

  • టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత్ ఆటగాడిగా అవతరణ
  • పూణే టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లతో కలిపి ఈ ఏడాది 32కి చేరిన సిక్సులు
  • మరో 2 సిక్సర్లు బాదితే బద్దలు కానున్న వరల్డ్ రికార్డు
పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 113 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో 2012 తర్వాత భారత్ స్వదేశంలో తొలి టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినట్టు అయింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మినహా ఎవరూ 50కి పైగా స్కోర్లు చేయలేకపోయారు. జైస్వాల్ వేగంగా ఆడి కేవలం 65 బంతుల్లోనే 77 పరుగులు బాదాడు. తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో జైస్వాల్ ఒక ప్రత్యేక రికార్డును సాధించాడు.

92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఏడాదిలో 30కి పైగా సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 2024లో జైస్వాల్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన మూడు సిక్సర్లతో కలుపుకొని ఈ ఏడాది మొత్తం అతడి సిక్సర్ల సంఖ్య 32కి పెరిగింది. అతడికి సమీపంలో భారతీయ క్రికెట్లు ఎవరూ లేరు. ఇక అంతర్జాతీయంగా చూస్తే టెస్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ (33 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 

2024లో టీమిండియా మరో 5 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో ఒకటి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో మరో రెండు సిక్సర్లు బాది మెకల్లమ్ రికార్డును యశస్వి జైస్వాల్ సునాయాసంగా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది భారీగా సిక్సర్లు బాదడమే కాదు, 1,000కి పైగా టెస్టు పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు.


More Telugu News