మహారాష్ట్రలోని ఆ నియోజకవర్గంలో తండ్రిపై కూతురు సై

  • ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నుంచి పోటీ చేస్తున్న తండ్రి ధర్మారావుబాబా
  • ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ నుంచి పోటీ చేస్తున్న కూతురు భాగ్యశ్రీ
  • అహేరీలో తండ్రీకూతురు మధ్య ఆసక్తికర పోటీ
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తండ్రీ కూతుళ్లు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. గడ్చిరోలి మావోయిస్ట్ ప్రభావిత జిల్లా. అహేరిలో గిరిజనులు ఎక్కువ. ఇక్కడి నుంచి మంత్రి ధర్మారావుబాబా ఆత్రమ్ ఎన్సీపీ (అజిత్ పవార్ పార్టీ) నుంచి పోటీ చేస్తుండగా, ఆయన కూతురు భాగ్యశ్రీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తండ్రీ కూతుళ్లు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో మహారాష్ట్రలో చర్చనీయాశంగా మారింది.

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. మంత్రి ధర్మారావుబాబాపై ఇప్పటికే కూతురు పోటీ చేస్తోంది. ఆయన బంధువుల నుంచే మరో అభ్యర్థి కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ధర్మారావుబాబా మేనల్లుడు, బీజేపీ జిల్లా కీలక నేత అంబరీష్ రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఒక ఫ్యామిలీ (లేదా బంధువులు) నుంచి త్రిముఖ పోరు ఉండనుంది.

శరద్ పవార్‌పై ధర్మారావుబాబా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన రాజకీయ జీవిత చరమాంకంలో శరద్ పవార్ కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు తన అదృష్టాన్ని దెబ్బతీయలేదని, శరద్ పవార్ పార్టీ నుంచి తనపై పోటీ ఆంటే ఆమె రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అన్నారు. తనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందన్నారు. అహేరీ అభివృద్ధికి తాను ఎంతో చేశానన్నారు. లడ్కీ బహిన్ ప్రయోజనాలు ప్రతి మహిళకు చేరేలా చూశానన్నారు.

తన తండ్రి వ్యాఖ్యలపై కూతురు భాగ్యశ్రీ స్పందించారు. ఎమోషనల్ మాటలు తనను పోటీ నుంచి వెనక్కి లాగలేవన్నారు. పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, ఇక వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. తనపై ఎవరు పోటీ చేస్తున్నారనే విషయం తనకు అవసరం లేదన్నారు.


More Telugu News