ర‌స‌వ‌త్తరంగా రెండో టెస్టు.. 255 ప‌రుగుల‌కే కివీస్ ఆలౌట్‌.. భార‌త్ టార్గెట్ 359 ర‌న్స్‌!

  • పూణే వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ మ‌ధ్య‌ రెండో టెస్టు
  • రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 255 ప‌రుగుల‌కే ఆలౌట్ 
  • మొద‌టి ఇన్నింగ్స్‌లో 103 ప‌రుగుల ఆధిక్యం 
  • తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకొని భార‌త్ ముందు 359 ప‌రుగుల ల‌క్ష్యం
పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు న్యూజిలాండ్‌ 359 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. 

రెండో రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి 301 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్‌.. మూడో రోజు మ‌రో 57 పరుగులు జోడించి ఆలౌటైంది. రెండు రోజులుగా ఎలాంటి వికెట్లు తీయని రవీంద్ర జడేజా ఇవాళ మూడు వికెట్లు తీశాడు. దాంతో కివీస్ ఇన్నింగ్స్ త్వ‌ర‌గా ముగిసింది. 

భార‌త బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ 4, ర‌వీంద్ర జ‌డేజా 3 వికెట్లు తీయ‌గా.. అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక కివీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ టామ్ లాథ‌మ్ 86 ప‌రుగులు చేస్తే, గ్లెన్ ఫిలిప్స్ 48 (నాటౌట్) ర‌న్స్‌తో రాణించాడు. ఇక భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్ లో 156 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన విష‌యం తెలిసిందే. 

359 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ధాటిగా ఆడుతోంది. భోజ‌న విరామానికి వికెట్ న‌ష్టానికి 81 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైస్వాల్ (46), శుభ్‌మ‌న్ గిల్ (22) ఉన్నారు. భార‌త్ గెల‌వాలంటే ఇంకా 278 ర‌న్స్ చేయాలి. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. 8 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 


More Telugu News