అప్పుడు సెహ్వాగ్ అలా చెప్ప‌డంతో ఇప్ప‌టికీ మాట్లాడుకోం.. త‌న పుస్తకం 'ది షోమ్యాన్‌'లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన మ్యాక్స్‌వెల్!

  • 2017 ఐపీఎల్ సీజ‌న్‌లో సెహ్వాగ్‌తో జ‌రిగిన గొడ‌వ‌ను గుర్తు చేసిన మ్యాక్స్‌వెల్‌
  • ఆ సీజ‌న్‌లో ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌ప‌రిచిన పంజాబ్‌ కింగ్స్  
  • కెప్టెన్‌గా ఉన్న మ్యాక్సీని బాధ్యుడిని చేశాడట‌ మెంటార్ వీరూ
  • మీ అభిమానాన్ని కోల్పోయారంటూ సెహ్వాగ్‌కు మ్యాక్స్‌వెల్ మెసేజ్‌
  • దానికి  'మీలాంటి అభిమాని అవసరం లేదు' అని వీరేంద్రుడి రిప్లై
  • అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లేవ‌ని తాజా త‌న బుక్ 'ది షోమ్యాన్‌'లో వెల్ల‌డి
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో అద్భుత‌మైన‌ ప్రయాణాన్ని కలిగి ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌న‌ పుస్తకం 'ది షోమ్యాన్‌'లో మ్యాక్స్‌వెల్ తన ఐపీఎల్‌ ప్రయాణాన్ని వివరించాడు. ఈ సంద‌ర్భంగా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్‌కు ఆడిన‌ప్పుడు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను అత‌డు ప్ర‌స్తావించాడు. 

2017లో ఐపీఎల్ సీజ‌న్ సంద‌ర్భంగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ సీజ‌న్‌లో జ‌ట్టు మెంటార్‌గా భార‌త మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. అయితే, జ‌ట్టు సార‌థిగా కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు మ్యాక్స్‌వెల్. కాగా, టోర్నీ ఆసాంతం జ‌ట్టు కీల‌క నిర్ణ‌యాల‌న్నీ మెంటార్ సెహ్వాగే తీసుకునేవాడ‌ట‌. కెప్టెన్‌గా త‌న‌కు ఏమాత్రం ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని మ్యాక్స్‌వెల్ వాపోయాడు. 

చివ‌రికి ఆ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ అవ‌మాన‌క‌ర జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ను చివ‌రికి కెప్టెన్‌గా ఉన్న‌ త‌న‌పై నెట్టేశాడ‌ట మెంటార్ సెహ్వాగ్‌. అంతే.. వీరేంద్రుడి చ‌ర్య మ్యాక్స్‌వెల్‌కు కోపం తెప్పించింది‌. దాంతో ఆ సీజ‌న్ ముగిసిన త‌ర్వాత సెహ్వాగ్‌కు మ్యాక్సీ ఒక సందేశం పంపించాడ‌ట‌. 

'మీ చ‌ర్య‌తో మీపై నా అభిమానాన్ని కోల్పోయారు' అని మెసేజ్ చేశాడ‌ట‌. దానికి వీరూ నుంచి ఊహించ‌ని రిప్లై వ‌చ్చిందట‌. 'మీలాంటి అభిమాని అవసరం లేదు' అనేది సెహ్వాగ్ నుంచి వ‌చ్చిన స‌మాధానం. అది చూసి చాలా బాధ‌ప‌డిన‌ట్లు మ్యాక్స్‌వెల్ తాజాగా త‌న బుక్‌లో రాసుకొచ్చాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ సెహ్వాగ్‌తో తాను మాట్లాడ‌లేద‌ని తెలిపాడు.

ఇక మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ జ‌ర్నీ మొద‌టిసారి 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జ‌ట్టుతోనే ప్రారంభ‌మైంది. ఆ సీజ‌న్‌లో పంజాబ్ అద్భుతంగా రాణించి ఏకంగా ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఆ సీజ‌న్ మొత్తం మ్యాక్సీ అద్భుత‌మైన ప్రదర్శనతో ఆక‌ట్టుకున్నాడు. ఏకంగా 552 పరుగులు చేశాడు. అయితే, ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్.. పంజాబ్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సీజ‌న్‌ను కూడా మ్యాక్స్‌వెల్ త‌న పుస్త‌కంలో ప్ర‌స్తావించాడు. 

ఆ త‌ర్వాత 2021లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) కి ఆడ‌టంతో త‌న ఆట‌లో ప‌రిపూర్ణ‌త వ‌చ్చిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అక్క‌డ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియ‌ర్స్ సాన్నిహిత్యం త‌న ఆట‌ను మెరుగుప‌ర‌చుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డింద‌ని తెలిపాడు. త‌న ఐపీఎల్‌ కెరీర్‌లో ఆర్‌సీబీకి ఆడ‌టం అనేది కొత్త దశ అని పేర్కొన్నాడు. 


More Telugu News