డేటాఫ్ బర్త్ కు ఆధార్ కార్డే ప్రామాణికమా?... సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే...!

  • ఆధార్ కేవలం గుర్తింపు కోసమేనని గుర్తు చేసిన సుప్రీం కోర్టు
  • డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని స్పష్టీకరణ
  • పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీం  
డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని, పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పంజాబ్ – హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. యూఐడీఏఇ ఇచ్చిన తాజా సర్క్యులర్ ప్రకారం .. ఆధార్ కేవలం గుర్తింపు కోసమేనని, పుట్టిన తేదీకి రుజువు కాదన్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. 

విషయంలోకి వెళితే .. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తికి రూ.19.35 లక్షల పరిహారం చెల్లించాలని రోహ్‌తక్‌లోని మోటారు యాక్సిడెంట్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసు పంజాబ్ – హర్యానా హైకోర్టుకు చేరింది. స్థానిక ట్రైబ్యునల్ వయసును తప్పుగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుందని హైకోర్టు పేర్కొంటూ పరిహారాన్ని రూ.9.22 లక్షలకు కుదించింది. బాధితుడి ఆథార్ కార్డు ఆధారంగా వయస్సు 47 ఏళ్లుగా నిర్ధారించి పరిహారం లెక్కకట్టినట్లు పేర్కొంది.

దీనిని సవాల్ చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాఠశాల రికార్డుల ప్రకారం బాధితుడి వయసు 45 ఏళ్లు మాత్రమేనని అతని తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం .. ఆ వాదనతో ఏకీభవిస్తూ.. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పును సమర్థించింది.  


More Telugu News