భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ షురూ !

  • ఇరువైపులా టెంట్లు, తాత్కాలిక నిర్మాణాల తొలగింపు మొదలు
  • ఎవరివైపు వారు వెనక్కి వెళుతున్న బలగాలు
  • మరో 4-5 రోజుల్లో పెట్రోలింగ్ మొదలయ్యే అవకాశాలు
తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ భారత్, చైనా ఇటీవల ఏకాభిప్రాయానికి వచ్చి కీలకమైన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం మేరకు వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇరువైపులా టెంట్లు, కొన్ని తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు. భారత సైనికులు చార్డింగ్ నాలా పశ్చిమ వైపు వెనుతిరగగా... చైనా సైనికులు నాలా తూర్పు వైపు వెనక్కి వెళ్లిపోతున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా ఇరువైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, సుమారుగా 12 టెంట్లు ఉంటాయని, వీటిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గురువారం ఈ ప్రాంతంలో చైనా సైన్యం తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. భారత సైన్యం కూడా దళాలను ఉపసంహరించుకుంది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాబోయే 4-5 రోజుల్లో డెప్సాంగ్, డెమ్‌చోక్‌లలో పెట్రోలింగ్ పునఃప్రారంభం కానుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

కాగా 2020లో గాల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన తర్వాత నాలుగేళ్లపాటు సైనిక ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత మూడు రోజుల క్రితమే ఒప్పందం కుదరడంతో సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొననున్నాయి.


More Telugu News