కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క

  • అధికారం కోల్పోయాక కేటీఆర్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని విమర్శ
  • ముఖ్యమంత్రి కుర్చీని అవమానించేలా మాట్లాడవద్దని హితవు
  • ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం కోల్పోయాక ఆయన కావాలనే ప్రభుత్వంపై దూషణకు దిగుతున్నారని, కానీ అలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. పదేళ్లు మంత్రిగా వెలగబెట్టిన కేటీఆర్ అధికారం కోల్పోయాక సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, అలాగే మాట్లాడితే తగిన రీతిలో సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి కుర్చీని అవమానించేలా మాట్లాడవద్దన్నారు.

ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సీతక్క ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలను పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు దొంగ ఏడుపు ఏడుస్తున్నారని విమర్శించారు. పంట రుణమాఫీ చేయని బీఆర్ఎస్‌ను ప్రజలు, రైతులు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడించారన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఏకకాలంలో రుణమాఫీ చేసిందన్నారు.

రైతులకు ఉచిత ఎరువులు, సన్నాలకు రూ.500 బోనస్ వంటి హామీలను ఇచ్చి అమలు చేశామన్నారు. పంట బీమా పథకం లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలుకు 7,248 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తమ ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీ చెల్లించే పరిస్థితి వచ్చిందని సీతక్క వాపోయారు.


More Telugu News