కుటుంబ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవే: జగన్

  • విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్ల‌లో ప‌ర్య‌టించిన మాజీ సీఎం జ‌గ‌న్‌
  • డ‌యేరియా బాధిత కుటుంబాల‌తో ముచ్చ‌టించిన వైసీపీ అధినేత‌
  • మ‌రోసారి కూట‌మి ప్ర‌భుత్వంపై ధ్వ‌జం
  • డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్ర‌హం
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్ల‌లో ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల గుర్ల‌లో అతిసారం స్వైర‌విహారం కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోదైన విష‌యం తెలిసిందే. దాదాపు 10 మంది డయేరియాతో చ‌నిపోయినట్టు తెలుస్తోంది. మ‌రికొంద‌రు ఇప్ప‌టికీ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ఈ నేపథ్యంలో... అతిసారం ప్ర‌బ‌లి చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌ను జ‌గ‌న్ నేడు ప‌రామ‌ర్శించారు. వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా క‌ల్పించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... ఆస్తుల వ్యవహారంపై స్పందించారు. 

కుటుంబ గొడ‌వ‌ల్లో క‌ల్పించుకోవ‌డం త‌గ‌ద‌ని హితవు ప‌లికారు. కుటుంబ గొడ‌వ‌లు ప్ర‌తి ఇంట్లో ఉండేవేన‌ని, వాటిని అడ్డుపెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌ మ‌రోసారి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ద‌త్త‌పుత్రుడు అంటూ సంభోదిస్తూ విమ‌ర్శించారు.   

కూట‌మి ప్ర‌భుత్వంపైనా జగన్ ధ్వ‌జ‌మెత్తారు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ఆపి, హామీల‌ను అమ‌లు చేయాల‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌గ‌న్ పేరు చెప్పి డైవ‌ర్ట్ చేయ‌డం ప్ర‌భుత్వానికి ప‌రిపాటిగా మారింద‌ని ఎద్దేవా చేశారు. 





More Telugu News