రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ స‌ల్మాన్‌కు బెదిరింపులు.. కూరగాయల వ్యాపారి అరెస్ట్‌!

  • జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారిని అరెస్ట్ చేసిన‌ పోలీసులు 
  • ఈ నెల‌ 18న ముంబ‌యి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం
  • గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ మెసేజ్‌
  • ద‌ర్యాప్తు చేసి సందేశం పంపిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

ఆ వివరాలలోకి వెళితే, ఈ నెల‌ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఓ బెదిరింపు సందేశం వ‌చ్చింది.  గుర్తు తెలియని వ్యక్తి నుంచి సందేశం రావ‌డంతో కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలో జంషెడ్‌పూర్‌లోని స్థానిక పోలీసుల సహాయంతో బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ వ్యక్తిని ట్రాక్ చేసి అరెస్టు చేశామ‌న్నారు. తదుపరి విచారణ కోసం అతన్ని ముంబ‌యికి తీసుకువస్తామ‌ని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇక తాను అడిగిన సొమ్ము చెల్లించకపోతే సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు త‌ప్ప‌ద‌ని స‌ద‌రు వ్య‌క్తి త‌న‌ బెదిరింపు సందేశంలో పేర్కొన్నాడు. "దీనిని తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ సజీవంగా ఉండి, లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వాన్ని ముగించాలనుకుంటే రూ. 5 కోట్లు చెల్లించాలి. ఒక‌వేళ డబ్బు ఇవ్వకపోతే, సల్మాన్ ఖాన్ పరిస్థితి మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిక్ (ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన వ్య‌క్తి) కంటే మరింత దారుణంగా ఉంటుంది అని సందేశం పంపాడు.  

దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతుండ‌గానే ఈ నెల 21న అదే వ్యక్తి మళ్లీ పోలీసులకు మ‌రో సందేశం పంపించాడు. ఇంత‌కుముందు పంపిన‌ సందేశానికి క్షమాపణలు కోరాడు. పొరపాటున దాన్ని పంపినట్లు పేర్కొన్నాడు.

అయితే, ఇటీవల సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ఎన్‌సీపీ నేత‌ బాబా సిద్ధిక్ హత్య నేపథ్యంలో అధికారులు ఆ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్నారు. దాంతో స‌ల్లూభాయ్‌కు భద్రతను పెంచారు. అలాగే ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి, జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రేత‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఇక కృష్ణ‌జింక‌ల‌ను వేటాడిన కేసు నేప‌థ్యంలో ఇప్ప‌టికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ ఖాన్‌కు ప‌లుమార్లు హత్య బెదిరింపులు వ‌చ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో స‌ల్మాన్‌ బాంద్రా ఇంటి వెలుపల బిష్ణోయ్ ముఠాలోని అనుమానిత సభ్యులు కాల్పుల‌కు కూడా పాల్ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో కొన్ని నెలల క్రితం నవీ ముంబ‌యి పోలీసులు కండ‌ల‌వీరుడిని చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన కుట్ర‌ను కూడా బయటపెట్టారు. అప్ప‌టి నుంచి స‌ల్లూ భాయ్‌కు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 


More Telugu News