వ్యక్తిగత స్వార్థంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మపై వరుదు కల్యాణి ఫైర్

  • పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్న వరుదు కల్యాణి
  • వాసిరెడ్డి పద్మకు జగన్ కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చారని వ్యాఖ్య
  • వైసీపీపై బురద చల్లడాన్ని మానుకోవాలని హితవు
వైసీపీకి ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురైనా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం పని చేశానని ఆమె అన్నారు. పాలనలో, పార్టీని నడిపించడంలో జగన్ కు ఏమాత్రం బాధ్యత లేదని విమర్శించారు. గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను మరోసారి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కార్యకర్తలను జగనన్న సరిగా చూసుకోకపోతే ఆమెకు మహిళా ఛైర్ పర్సన్ పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు జగనన్న అగ్ర స్థానాన్ని కల్పించారని చెప్పారు. వ్యక్తిగత స్వార్థంతో జగనన్నపై వాసిరెడ్డి పద్మ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

వాసిరెడ్డి పద్మకు కేబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని జగనన్న ఇచ్చారని చెప్పారు. పదవిలో ఉన్నప్పుడే ఆమె పార్టీకి రాజీనామా చేయవలసిందని అన్నారు. పదవులు అనుభవించిన తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడటం దారుణమని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం ఆత్మవంచన చేసుకోకూడదని చెప్పారు. వైసీపీపై బుదర చల్లడాన్ని మానుకోవాలని హితవు పలికారు. 


More Telugu News