ఐపీఎల్ మెగా వేలంపై రిషబ్ పంత్ కీలక నిర్ణయం?.. తెరపైకి ఆసక్తికర కథనం

  • ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాలని పంత్ యోచన!
  • వేలంలోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టుగా కథనాలు
  • పంత్‌ను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్న ఆర్సీబీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వీడాలనుకుంటున్నాడా? అంటే ఔననే అంటున్నాయి కథనాలు. ఐపీఎల్ మెగా వేలం 2025లోకి ప్రవేశించాలని పంత్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన కెరీర్ మొత్తం ఢిల్లీ ఫ్రాంచైజీకి మాత్రమే ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఇక జట్టును వీడాలని భావిస్తున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. మెగా వేలంలోకి పంత్ ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అతడిపై పలు ఫ్రాంచైజీలు దృష్టిసారించాయని, ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా కెప్టెన్‌గా పంత్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నాయని తెలిపింది.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఈ మధ్య మాట్లాడుతూ.. రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లలో రిషబ్ పంత్ తప్పుకుండా ఉంటాడని అన్నారు. తమ జట్టులో ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, ఎవరెవర్ని నిలుపుదల చేసుకోవాలనే దానిపై జీఎంఆర్, తమ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పార్థ్ జిందాల్ చెప్పారు. కానీ తాజా కథనాలను చూస్తుంటే పంత్ ఆ జట్టులో కొనసాగడం సందేహమే అనిపిస్తోంది. ఇప్పటికే కోచింగ్ సిబ్బంది నుంచి రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ నిష్క్రమించారు. ఇక పంత్ కూడా లేకుంటే జట్టులో కీలక మార్పులు జరగడం ఖాయం.


More Telugu News