'దంగ‌ల్' సినిమా రూ.2వేల కోట్లు కొల్ల‌గొడితే.. ఫోగ‌ట్ ఫ్యామిలీకి ద‌క్కిందెంతో తెలుసా?

  • 'న్యూస్ 24'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన‌ బబితా ఫోగ‌ట్‌
  • త‌మ ఫ్యామిలీకి మేక‌ర్స్‌ కేవ‌లం రూ.1కోటి మాత్ర‌మే ఇచ్చార‌న్న మాజీ రెజ్ల‌ర్‌
  • మహావీర్ ఫోగట్, ఆయ‌న కుమార్తెలు బబితా, గీతా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'దంగ‌ల్' మూవీ 
మ‌ల్ల యోధుడు మహావీర్ సింగ్‌ ఫోగట్, ఆయ‌న కుమార్తెలు బబితా ఫోగట్, గీతా ఫోగట్ జీవిత క‌థ ఆధారంగా గతంలో తెర‌కెక్కిన బాలీవుడ్ చిత్రం 'దంగల్‌'. ఈ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. బాలీవుడ్‌ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత ప‌లు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీ ఏకంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింద‌ని స‌మాచారం.  

అయితే, ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన బబితా ఫోగట్ తాజాగా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన‌ బబిత తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దంగల్ సినిమా మేక‌ర్స్ నుంచి త‌మ కుటుంబానికి అందిన‌ ఆర్థిక వివరాలను ఆమె వెల్లడించారు. తన కుటుంబానికి మేకర్స్ నుంచి కేవ‌లం రూ. 1 కోటి మాత్రమే అందాయ‌ని ఆమె తెలిపారు.

"దంగల్ సినిమాకు వచ్చిన రూ. 2,000 కోట్లలో ఫోగట్ కుటుంబానికి కేవలం రూ. 1 కోటి మాత్రమే వచ్చింది" అని న్యూస్ 24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బబితా వెల్ల‌డించారు. 

అయితే, ఇంత త‌క్కువ మొత్తం ద‌క్కినందుకు మీకు బాధ‌గా అనిపించలేదా? అని అడిగిన మ‌రో ప్ర‌శ్నకు బ‌బిత త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. తన కుటుంబం ఉద్దేశం ఈ మూవీ నుంచి డ‌బ్బు ఆశించ‌డం కాద‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి గౌరవం, ప్రేమను సంపాదించడం మాత్రమేనని అన్నారు. 

ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి త‌మ‌తో ఒక విష‌యం చెప్పార‌ని బ‌బిత తెలిపారు. అదేంటంటే.. త‌మ‌కు ప్రజల ప్రేమ, గౌరవం మాత్ర‌మే కావాలి, డ‌బ్బు ముఖ్యం కాద‌న్నార‌ని ఆమె పేర్కొన్నారు.

ఇక 2016లో విడుదలైన 'దంగల్' చిత్రం మహావీర్ ఫోగట్ తన కుమార్తెలను ఎలైట్ రెజ్లర్‌లుగా ఎలా మార్చార‌నే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఆ త‌ర్వాత‌ ఇద్ద‌రూ కూతుళ్లు దేశానికి ప‌త‌కాలు సాధించ‌డం చూపించారు.

కాగా, దేశం కోసం బబిత ప్ర‌పంచ వేదిక‌ల‌పై ప‌లు ప‌త‌కాలు సాధించిపెట్టారు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2012లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్య పతకం సాధించారు. 

అలాగే 2014లో ఆమె కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ప‌సిడి ప‌త‌కాన్ని కొల్ల‌గొట్టారు.  2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న‌ప్ప‌టికీ పతకం గెలవలేకపోయారు. 2019లో బబిత కుస్తీ పోటీలకు స్వ‌స్తిప‌లికి రాజకీయాల్లోకి వెళ్లారు.


More Telugu News