సమంత, నాగచైతన్య నావల్లే విడిపోయారంటూ సురేఖ అసహ్యంగా మాట్లాడారు: కోర్టులో కేటీఆర్ సుదీర్ఘ వాంగ్మూలం

  • ఫోన్ ట్యాపింగ్ చేశానని, డ్రగ్స్ తీసుకున్నానంటూ ఆరోపించారన్న కేటీఆర్
  • ఆమె చేసిన వ్యాఖ్యలు చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉన్నాయన్న కేటీఆర్
  • బాధ్యత గల పదవిలో ఉండి తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, వివరంగా ఆమె అన్న మాటలు చెప్పమంటే చెబుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సమంత, నాగచైతన్య తన వల్లే విడిపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేశారని వెల్లడించారు. కొండా సురేఖపై పరువునష్టం దావాకు సంబంధించి ఈరోజు కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

మంత్రి కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఫిర్యాదులో అన్ని విషయాలు ఉన్నాయని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దానినే ప్రామాణికంగా తీసుకోమంటారా? లేక మళ్లీ స్టేట్‌మెంట్ ఇస్తారా? అని కోర్టు ప్రశ్నించింది.

కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయన్నారు. వివరంగా చెప్పడానికి సిద్ధమే అన్నారు. ఈ సందర్భంగా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొన్నింటిని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని, తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసినట్లు చెప్పారు. ఇతరులు డ్రగ్స్ తీసుకునేలా తాను ప్రేరేపించినట్లు చెప్పారన్నారు. తన వల్లే కొన్ని పెళ్లిళ్లు బ్రేక్ అయినట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారన్నారు.

ఆమె చేసిన వ్యాఖ్యలు చదవాలంటేనే ఇబ్బందికరంగా ఉందని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. నోటితో అన్నీ చెప్పలేని విధంగా ఉన్నాయన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్నారు.

సాక్షులు దాసోజు శ్ర‌వ‌ణ్, బాల్క సుమ‌న్, స‌త్య‌వ‌తి రాథోడ్ తనకు పద్దెనిమిదేళ్లుగా తెలుసునని... కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను టీవీలో చూసి వాళ్లు తనకు ఫోన్ చేసి చెప్పారని కోర్టుకు తెలిపారు. సురేఖ వ్యాఖ్య‌ల‌తో తన ప‌రువు, ప్ర‌తిష్ట దెబ్బ‌తిన్నాయన్నారు. తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం చేయాల‌ని ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. కోర్టు అరగంట పాటు కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అనంతరం కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News