హిజ్బుల్లాకు దెబ్బ మీద దెబ్బ.. నస్రల్లా వారసుడిని కూడా అంతమొందించిన ఇజ్రాయెల్

  • హషేమ్ సఫీద్దీన్‌ను చంపేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటన
  • హిజ్బుల్లా ఇంటెలిజెన్సీ ప్రధాన కార్యాలయంపై దాడిలో చనిపోయాడని నిర్ధారణ
  • హిజ్బుల్లా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన హషేమ్ సఫీద్దీన్‌
ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ గ్రూపు ‘హిజ్బుల్లా’కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను అంతమొందించిన ఇజ్రాయెల్ తాజాగా అతడి వారసుడు హషేమ్ సఫీద్దీన్‌ను హత్య చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బుధవారం ధ్రువీకరించింది. ‘‘హిజ్బుల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషేమ్ సఫీద్దీన్, హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ కమాండర్ అలీ హుస్సేన్ హజిమాను 3 వారాల క్రితం హిజ్బుల్లా ప్రధాన ఇంటెలిజెన్స్ కార్యాలయంపై జరిపిన దాడిలో అంతమొందించాం’’ అని సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

ఎవరీ హషేమ్ సఫీద్దీన్?
హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లాకు హషేమ్ సఫీద్దిన్ బంధువు అవుతాడు. హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలను నిర్వహించే ‘జిహాద్ కౌన్సిల్‌’ బాధ్యతలు అతడే చూసుకునేవాడు. అంతేకాదు హిజ్బుల్లా సీనియర్ సైనిక-రాజకీయ ఫోరమ్, నిర్ణయాధికారం, విధాన రూపకల్పన చేసే ‘షురా కౌన్సిల్‌’లో కూడా సఫీద్దీన్ సభ్యుడిగా ఉండేవాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హిజ్బుల్లా ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే ‘ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’లో కూడా సభ్యుడిగా ఉండేవాడని, హిజ్బుల్లా నిర్ణయాలలో కీలక పాత్ర పోషించాడని పేర్కొంది.

కాగా గతేడాది ఇజ్రాయెల్ బందీల విడుదలకు చర్చలు జరపడంలో సఫీద్దిన్ కీలక పాత్ర పోషించాడు. ఇక భద్రతా కారణాల రీత్యా నస్రల్లా అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాడు. కాగా ఇజ్రాయెల్ ప్రకటనపై హిజ్బుల్లా ఇంతవరకు స్పందించలేదు.


More Telugu News