పృథ్వీ షాకు భారీ షాక్‌... రంజీ జ‌ట్టులోంచి ఉద్వాస‌న‌!

  • ఇప్ప‌టికే జాతీయ జ‌ట్టుకు దూర‌మైన‌ టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌
  • ఇప్పుడు ముంబ‌యి రంజీ జట్టులో కూడా చోటు కోల్పోయిన వైనం
  • ఫిట్‌నెస్, క్రమశిక్షణా రాహిత్యమే ఉద్వాస‌న‌కు కార‌ణ‌మ‌ని స‌మాచారం
ఇప్ప‌టికే జాతీయ జ‌ట్టుకు దూర‌మైన‌ టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌ పృథ్వీ షాకు తాజాగా మ‌రో భారీ షాక్ త‌గిలింది. ముంబ‌యి రంజీ ట్రోఫీ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. టీమ్ మేనేజ్‌మెంట్ అతనిని జట్టు నుంచి తొల‌గించ‌డంపై క‌చ్చితమైన కారణాన్ని వెల్ల‌డించనప్పటికీ, ఫిట్‌నెస్, క్రమశిక్షణా రాహిత్యమే ఉద్వాస‌న‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 

సంజయ్ పాటిల్ (ఛైర్మన్), రవి ఠాకూర్, జీతేంద్ర థాకరే, కిరణ్ పొవార్, విక్రాంత్ యెలిగేటిలతో కూడిన ముంబ‌యి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సెలక్షన్ కమిటీ రంజీ ట్రోఫీ నుంచి షాను తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.

పృథ్వీ షా క్రమశిక్షణా రాహిత్యం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు పెద్ద తలనొప్పిగా మారింద‌ని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. కనీసం ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ కు షాను దూరం ఉండ‌చం ద్వారా అతనిలో మార్పును తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయ‌ప‌డ్డాయి.

ఇటీవ‌ల షా త‌ర‌చూ నెట్ సెషన్‌లకు ఆలస్యంగా వస్తున్న‌ట్టు జట్టు మేనేజ్‌మెంట్ పేర్కొంది. పైగా అతను నెట్ సెషన్‌లను సీరియస్‌గా తీసుకోవ‌డం లేద‌ని కథనంలో పేర్కొన్నారు. ఇప్ప‌టికే అత‌డు అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నాడు. 

శ్రేయాస్ అయ్యర్ , శార్దూల్ ఠాకూర్, కెప్టెన్ అజింక్యా రహానే వంటి సీనియ‌ర్‌ క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్‌ల విషయంలో సీరియ‌స్‌గా ఉంటే... షా మాత్రం గ‌త కొంత‌కాలంగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక షాను తొలగించాలనే నిర్ణయం కేవలం మేనేజ్‌మెంట్, సెలెక్టర్లది మాత్రమే కాదని కథనం పేర్కొంది. కెప్టెన్, కోచ్ కూడా అతన్ని జట్టు నుండి తప్పించాల‌ని అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది.

2018లో రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో భారత్ త‌ర‌ఫున పృథ్వీ షా అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీతో చెల‌రేగాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. దాంతో టీమిండియాకు మంచి ఓపెన‌ర్ దొరికాడంటూ అంద‌రూ మెచ్చుకున్నారు. కానీ, ఆ త‌ర్వాత ఎక్కువ కాలం జ‌ట్టులో కొన‌సాగ‌లేకపోయాడు. 

ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ఈ రంజీ సీజన్‌లోనూ షా ఆడిన రెండు మ్యాచ్‌ల‌లో కూడా ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. బరోడాపై 7, 12 ప‌రుగులు చేస్తే, మహారాష్ట్రపై 1, 39 (నాటౌట్) ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. అత‌ని తోటి ఆట‌గాళ్లు అంత‌ర్జాతీయ స్థాయిలో స‌త్తాచాటుతుంటే.. షా మాత్రం వివాదాల‌తో క్రికెట్ కెరీర్‌ను ప్ర‌మాదంలో ప‌డేసుకుంటున్నాడ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


More Telugu News