ఛ‌టేశ్వర్ పుజారా స్ట‌న్నింగ్ ఫీట్‌.. కోహ్లీ, రోహిత్‌ల‌కు అంద‌నంత దూరంలో స్టార్ క్రికెట‌ర్‌!

  • 66వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ న‌మోదు చేసిన పుజారా
  • ఛత్తీస్‌గఢ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ద్విశ‌త‌కం బాదిన‌ స్టార్ క్రికెట‌ర్‌
  • అత్యధిక ఫస్ట్‌క్లాస్ శ‌త‌కాల జాబితాలో కోహ్లీ, రోహిత్‌ల కంటే ముందంజ‌లో పుజారా
టీమిండియా క్రికెటర్ ఛ‌టేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. తాజాగా 66వ శ‌త‌కం బాదాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న‌ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర‌కు ఆడుతున్న పుజారా ద్విశ‌త‌కం (234) న‌మోదు చేశాడు. ఇది ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని తొమ్మిదో డబుల్ సెంచరీ. 

దీంతో రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన భార‌తీయ‌ ఆట‌గాళ్ల‌ జాబితాలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు. ప్ర‌స్తుతం అతను రాహుల్ ద్రవిడ్ (68) కంటే కేవలం రెండు శ‌త‌కాలు మాత్ర‌మే వెనుకబడి ఉన్నాడు. ఇక ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ చెరో 81 ఫస్ట్ క్లాస్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు.

కాగా, పుజారా 66 ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ సెంచరీల‌తో ప్రస్తుత భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ముందంజ‌లో ఉన్నాడు. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో కోహ్లీ 36, రోహిత్ 29 సెంచ‌రీలు మాత్రమే చేశారు.

ఇక గ‌త‌ కొంతకాలంగా ఫామ్‌లేమితో భార‌త టెస్టు జ‌ట్టుకు పుజారా దూర‌మైన విష‌యం తెలిసిందే. అత‌డు చివరిసారిగా 2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టులో టీమిండియా తరఫున ఆడాడు. అప్ప‌టినుంచి తిరిగి జ‌ట్టులోకి రాలేదు. తాజాగా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న పుజారా మ‌రోసారి బీసీసీఐ త‌లుపు త‌డ‌తాడేమో చూడాలి. 

వ‌చ్చే నవంబర్, డిసెంబరులో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత్‌కు చివరి రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్ విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. దీంతో అత‌డ్ని ఇప్పుడు మ‌ళ్లీ బీసీసీఐ సెలెక్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.


More Telugu News