పుణే టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

  • రెండో టెస్టుకు కూడా స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూరం
  • వెల్లడించిన కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్
  • గజ్జ గాయం నుంచి కోలుకుంటున్న స్టార్ బ్యాటర్
పుణే వేదికగా భారత్‌తో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు పర్యాటక న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అందుబాటులోకి వస్తాడని భావించిన ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ రెండవ మ్యాచ్ కూడా ఆడబోడని న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. విలియమ్సన్‌ను పర్యవేక్షిస్తున్నామని, సరైన రీతిలోనే అతడు కోలుకుంటున్నాడని, అయితే సంపూర్ణ ఫిట్‌నెస్‌తో లేడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. అతడి పునరావాసం ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.

రాబోయే రోజుల్లో మరింత మెరుగయ్యి, మూడవ టెస్టుకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. విలియమ్సన్ సంసిద్ధంగా ఉండడానికి వీలైనంత ఎక్కువ సమయం ఇస్తామని, జాగ్రత్త విధానాన్ని కొనసాగిస్తామని గ్యారీ స్టెడ్ స్పష్టం చేశారు. విలియమ్సన్ విషయంలో అంత కంగారు పడకూడదని నిర్ణయించామని స్టెడ్ చెప్పారు. కాగా శ్రీలంక సిరీస్ సమయంలో విలియమ్సన్ గజ్జ గాయానికి గురయ్యాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే బెంగళూరు టెస్టుకి అందుబాటులోకి రాలేదు. ఇక రెండవ టెస్ట్‌కు అందుబాటులోకి వస్తాడని భావించినప్పటికీ అందుబాటులోకి రాడని తేలిపోయింది.

కాగా గురువారం నుంచి పుణే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి మూడవ టెస్ట్ మొదలుకానుంది. బెంగళూరు టెస్ట్ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.


More Telugu News