కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే ఉంచిన కొడుకు

  • అస్సాంలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
  • అస్థిపంజరం స్థితికి చేరిన మృతదేహం 
  • మానసిక సమస్యలతో బాధపడుతున్న కొడుకు
అస్సాంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గౌహతి నగరంలోని జ్యోతికూచి ఏరియాలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహంతో ఓ వ్యక్తి ఏకంగా మూడు నెలలు ఇంట్లోనే నివసించాడు. అస్థిపంజరం అవశేషాలు బయటపడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయింది పూర్ణిమా దేవిగా (75) పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి కొడుకు పేరు జయదీప్ దేయ్ అని, అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ఇరుగుపొరుగు వారు చెప్పారని వివరించారు. 

కాగా మృతదేహం బయటపడడంతో జయదీప్ దేయ్‌ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించనున్నట్టు తెలిపారు. ఇక ఆ ఇంటిని ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం పరిశీలించాయి. అస్థిపంజరానికి శవపరీక్ష నిర్వహించాల్సి ఉందని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి దేయ్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇరుగుపొరుగు వారు ఏమంటున్నారంటే..
దేయ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని, అందుకే చాలా మంది అతడితో మాట్లాడేవారు కాదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. తండ్రి బతికి ఉన్నప్పుడు ఆయనను తిట్టేవాడని, ఎవరితోనైనా మాట్లాడటానికి తల్లి బయటికి వస్తే ఆమెను కూడా తిట్టేవాడని  వివరించారు. ఇక గత కొన్ని నెలలుగా ఎప్పుడూ ఇంటికి తాళం వేసి ఉంచేవాడని పేర్కొన్నారు. తన తల్లి బాగానే ఉందని, ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదని కొంతమందికి అతడు చెప్పినట్టు కొందరు చెప్పారు.


More Telugu News