ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు

  • ఏపీలోని ఇసుక రీచ్‌ల నుండి పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం
  • రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని తెలిపిన చంద్రబాబు
  • ఇసుక తవ్వకాలపై సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచన
ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు జరిగేందుకు, ఇసుక లభ్యత పెంచేందుకు సీనరేజ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 

ఏపీ నుంచి తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు రహదారుల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందన్నారు. కావున.. ఆయా మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ శాండ్ పాలసీలో ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  
 
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్ ద్వారా కూడా ఇసుక తరలించుకునేందుకు అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే ఇసుక తీసుకువెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశంపై ఆలోచన చేయాలని సీఎం చెప్పారు. 


More Telugu News