తిరుమలలో తెలంగాణ లేఖలను అనుమతించడం లేదు: తెలంగాణ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

  • శ్రీవారి దర్శనానికి తెలంగాణ నేతల లేఖలను అనుమతించకపోవడం బాధాకరమన్న అనిరుధ్ రెడ్డి 
  • తెలంగాణ విషయంలో చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన
  • భద్రాచలం, యాదాద్రిలో ఏపీ నేతలలేఖలకు దర్శనాలు కల్పిస్తున్నట్లు వెల్లడి
విభజన సమయంలో చంద్రబాబు ఏపీ, తెలంగాణ... రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారని, కానీ తెలంగాణ కన్నును ఆయన తీసేసుకున్నారా? అని తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల మాడ వీధుల్లో ఆయన మాట్లాడుతూ... తాను ఎంతో బాధతో ఇక్కడ మాట్లాడుతున్నానని, తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించకపోవడం బాధాకరమన్నారు.

డయల్ యువర్ ఈవోలో తెలంగాణ లెటర్‌లు అనుమతించబోమని చెప్పారని వెల్లడించారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాచలం పుణ్యక్షేత్రాలలో ఏపీ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో చిన్నచూపు చూస్తోందని వాపోయారు.

సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుపతిలో రూమ్ ఇప్పించమని అడిగితే ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఏపీలో వైసీపీ ప్రభత్వం ఉంటే హైదరాబాద్‌లో టీడీపీ వాళ్లు ఆశ్రయం పొందుతారని, అలాగే టీడీపీ ప్రభుత్వం ఉంటే వైసీపీ వాళ్లు ఆశ్రయం పొందుతారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో ఏపీ వాళ్లు వ్యాపారాలు చేసుకుంటే తాము ఏమీ అనడం లేదన్నారు. ఏపీ వాళ్లను తెలంగాణకు రావొద్దని మేం నిర్ణయం తీసుకుంటే మీరెంత బాధపడతారో ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని, లేదంటే తెలంగాణ అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు.


More Telugu News