సీఎంగా ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు: చంద్ర‌బాబు

  • నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
  • ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న‌ సీఎం చంద్ర‌బాబు 
  • అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని వ్యాఖ్య‌
  • దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉందన్న చంద్రబాబు
  • ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్ర‌శంస‌
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్ర‌బాబునాయుడు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని అన్నారు. దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉందన్న చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలిపారు. 

ఏ ప్రగతికైనా పోలీసులే కీలకమ‌ని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఇలా ప్ర‌జాసేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్య‌మంత్రి అన్నారు. పోలీసుల సంక్షేమం కూటమి ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామన్నారు. 2014-2019లో పోలీసు శాఖకు రూ.600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 

పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణకు రూ.60 కోట్లు, కొత్తగా వాహనాల కోసం రూ.150 కోట్లు, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుకు రూ.27 కోట్లు, పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు ఖర్చు చేశామని ముఖ్య‌మంత్రి చెప్పారు. విశాఖలో గ్రేహౌండ్స్‌ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించామన్నారు. కమ్యూనికేషన్‌ పరికరాల కోసం రూ.20 కోట్లు పెండింగ్‌ పెడితే వాటినీ చెల్లించామన్న సీఎం... దిశ పేరుతో వాహనాలకు రూ.16 కోట్లు పెండింగ్ పెడితే వాటిని కూడా చెల్లించినట్టు వివ‌రించారు. 


More Telugu News