మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

  • మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా సురేశ్
  • రెండ్రోజుల కస్టడీ ముగియడంతో నేడు కోర్టుకు
  • నవంబర్ 4 వరకు రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలింపు
మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు రిమాండ్ పొడిగించింది. తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మ హత్య కేసులో గుంటూరు జిల్లా జైలులో సురేశ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను విచారించేందుకు అనుమతినివ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు మొన్న 48 గంటల కస్టడీకి అనుమతినిచ్చింది.  

కస్టడీ గడువు నేటితో ముగియడంతో పోలీసులు ఆయనను తాజాగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానం నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. 

2020 డిసెంబర్‌లో వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. కాగా, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలోనూ ఆయన కీలక నిందితుడిగా ఉన్నారు.


More Telugu News