ఢిల్లీలోని రోహిణిలో బాంబు పేలుడు... ఖలిస్థాని కోణంలో పోలీసుల దర్యాఫ్తు

  • ఢిల్లీలోని రోహిణిలో నిన్న ఉదయం భారీ పేలుడు
  • పాఠశాల గోడ కూలి దెబ్బతిన్న దుకాణాలు, కార్లు
  • వేర్పాటువాద గ్రూప్‌లపై భారత్ చర్యల నేపథ్యంలో ఖలిస్థానీ కోణంలో దర్యాఫ్తు
  • కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అతిశీ విమర్శలు
ఢిల్లీలో నిన్న ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటనలో ఖలీస్థానీ కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. దేశ రాజధాని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని, పాఠశాల గోడ కూలిపోవడంతోపాటు సమీపంలోని దుకాణాలు, కార్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.

పేలుడు నేపథ్యంలో ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ, ఘటనా స్థలికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించడానికి ఎన్ఎస్‌జీ రోబోలను మోహరించింది. ఢిల్లీలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి అతిశీ స్పందించారు.

కేంద్రం తీరును ఆమె తప్పుబట్టారు. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ముంబై 'అండర్ వరల్డ్' కాలం నాటి పరిస్థితులు ఢిల్లీలో కనిపిస్తున్నాయన్నారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై ఉందన్నారు. కానీ బీజేపీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోవడానికే బీజేపీ తన అధికారాన్ని వినియోగిస్తోందని విమర్శించారు.

వివిధ దర్యాఫ్తు సంస్థల సహకారంతో ఢిల్లీ పోలీసులు ఈ పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఖలిస్థానీ సానుభూతిపరుల కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. వేర్పాటువాద గ్రూప్‌లపై భారత ఏజెన్సీలు ఇటీవల తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా పేలుడు జరిగిందా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.


More Telugu News