గ్రూప్-1, ముత్యాలమ్మ ఆలయం ఘటనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది: కిషన్ రెడ్డి

  • రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి
  • వీహెచ్ పీ కార్యకర్తలను ఉగ్రవాదులను కొట్టినట్టు కొట్టారన్న కిషన్ రెడ్డి
  • నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ఆగ్రహం
  • గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని హితవు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ఘటనతో హైదరాబాద్ అట్టుడుకుతోందని అన్నారు. 

నిన్న సికింద్రాబాద్ లో వీహెచ్ పీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని ఉగ్రవాదులను కొట్టినట్టు కొట్టారని విమర్శించారు. నగరంలో పలు హిందూ పండుగలపై ఆంక్షలు విధించారని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హిందువులపై ఎందుకీ వివక్ష వైఖరి? అంటూ ధ్వజమెత్తారు. 

ఇక, గ్రూప్-1 అభ్యర్థులపైనా లాఠీలు ఝళిపించారని, ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో తన మొండి వైఖరి వీడాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.


More Telugu News