హైబీపీ ఉంటే శారీరకంగా చురుకుగా ఉండాలంటున్న నిపుణులు.. ఎందుకంటే ?

  • బీపీ మరీ ఎక్కువగా ఉంటే శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుందని వెల్లడి
  • ధమనులపైనా దుష్ప్రభావం పడుతుందని వార్నింగ్
  • బ్రెజిల్ శాస్త్రవేత్తల అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి..
హైబీపీ వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు తోడు శ్వాసకోశ సమస్యలు అదనంగా వచ్చి చేరుతాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారిలో శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదని వివరించారు. అయితే, దీనికి విరుగుడు మన చేతుల్లోనే ఉందని, శారీరకంగా చురుకుగా ఉండడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని పేర్కొన్నారు.

రక్త నాళాలు, ధమనులు చిక్కబడడం వల్ల రక్తపోటు పెరిగిపోతుందని, దీని ప్రభావంతో శ్వాసకోశనాళాలకు కూడా ఇదే తరహా ఇబ్బంది ఎదురవుతుందని సావో పాలో ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రొడాల్ఫో డి పౌలా వియేరియా తెలిపారు. ఫలితంగా ఊపిరితిత్తుల్లోకి గాలి చేరడం, అందులో నుంచి బయటకు రావడం కష్టమవుతుందని వివరించారు. 

ఇదిలాగే కొనసాగితే దీర్ఘకాలంలో శ్వాస పీల్చడం మరింత ఇబ్బందికరంగా మారి శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదని, దీనివల్ల వృద్ధాప్య లక్షణాలు మరింత వేగంగా శరీరాన్ని చుట్టుకుంటాయని చెప్పారు. ఈ ఇబ్బందులు దరిచేరకుండా ఉండాలంటే హైబీపీతో బాధపడుతున్న వారు శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. బ్రెజిల్ శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం వివరాలను బ్రెజిల్‌కు చెందిన జర్నల్ అడ్వాన్సెస్ ఇన్ రెస్పిరేటరీ మెడిసిన్ ప్రచురించింది.


More Telugu News