కృష్ణానదికి మరోసారి పోటెత్తిన వరద

  • ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద
  • శ్రీశైలం ప్రాజెక్టుకు 1. 9 లక్షల క్యూసెక్కుల వరద
  •  ఔట్ ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులు
  • ప్రకాశం బ్యారేజీ నుంచి 77వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద వస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1.9 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.90 అడుగులకు చేరింది. 

మరోవైపు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది. దీంతో 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,38,338 ఇన్ ఫ్లోను కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 31,204 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. 

పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అయిదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1.18 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ప్లో 1.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి 77,750 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ నదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.   


More Telugu News