అంపైర్లతో వాగ్వివాదానికి దిగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కారణం ఇదే!

  • నాలుగో రోజు ఆటను ముందుగా ముగించడంపై మండిపాటు
  • అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి
  • వికెట్లు తీయాలని భావించిన భారత జట్టు
  • వెలుతురు లేమి కారణంగా ముందుగానే ఆటను ముగించిన ఫీల్డ్ అంపైర్లు
బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కివీస్ గెలుపునకు ఆట చివరి రోజున 107 పరుగులు అవసరం. భారత్ గెలవాలంటే  107 పరుగులలోపే పర్యాటక జట్టుని ఆలౌట్ చేయాల్సి ఉంది. నాలుగో రోజున భారత్ రెండో ఇన్నింగ్స్ ముగియడంతో స్వల్ప లక్ష్య ఛేదనకు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆరంభించినా వెలుతురు తగ్గిపోవడంతో అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. ఆటను ముందుగానే ముగించడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ సీరియస్ అయ్యారు. ఇద్దరూ కలిసి అంపైర్లతో వాగ్వాదానికి దిగారు.

ఆటను ముందుగా నిలిపివేస్తూ ఆన్ ఫీల్డ్ అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై భారత ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురు ఉన్నప్పటికీ వాతావరణం మేఘావృతంగా ఉండడంతో వర్షం పడుతుందేమోనన్న ఆందోళనతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 బంతులు పడ్డాయి. నిజానికి కొత్త బంతి చేతిలో ఉండడంతో వికెట్లు పడగొట్టాలని భారత జట్టు భావించింది. 107 పరుగుల స్వల్ప స్కోరును రక్షించుకునేందుకు నాలుగో రోజు చివరన కనీసం రెండు మూడు వికెట్లు అయినా తీయాలని ఆటగాళ్లు భావించారు. కానీ అనూహ్యంగా బౌలింగ్ చేయవద్దంటూ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అంపైర్లు ఆపారు. వికెట్లు తీసే అవకాశం కోల్పోవడంతో భారత ఆటగాళ్లు అసంతృప్తికి గురయ్యారు. 

అంపైర్లతో భారత ఆటగాళ్ల వాగ్వివాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలావుంచితే నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించడంతో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవోన్ కాన్వే, టామ్ లాథమ్ సంతోషంగా మైదానాన్ని వీడారు.


More Telugu News