పరీక్షలు వాయిదా వేయాలనే వారికి హాల్ టిక్కెట్లు ఉన్నాయా?: కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం

  • గ్రూప్-1 పరీక్ష కోసం అభ్యర్థులంతా చదువుతున్నారన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
  • పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది కేటీఆర్‌ను కలవడం విడ్డూరమని వ్యాఖ్య
  • జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం
గ్రూప్-1 పరీక్షల కోసం అభ్యర్థులు అందరూ కష్టపడి చదువుతుంటే కొందరు మాత్రం పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కేటీఆర్‌తో చర్చలకు వెళ్లడం విడ్డూరంగా ఉందని, అసలు వారికి హాల్ టిక్కెట్లు ఉన్నాయా? అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జీవో 29పై అనవసర అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కొంతమంది రాజకీయ నేతలు 33,383 మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రిజర్వేషన్లలో అన్యాయం జరిగితే కోర్టులు ఊరుకోవని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.


More Telugu News