గృహ నిర్మాణదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. ఇసుక సీనరేజ్ ఎత్తివేత

  • ఉచిత ఇసుక విధానంలో సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • సీనరేజ్ వసూళ్లు ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
  • ఇసుక క్వారీల నుంచి ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచిత రవాణాకు అనుమతి
ఏపీలో గృహ నిర్మాణ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రీచ్‌ (ఇసుక క్వారీ)ల నుంచి సొంత అవసరాలకు ట్రాక్టర్‌ల ద్వారా కూడా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రజలు సొంత అవసరాలకు గతంలో రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పటి నుంచి ఎడ్ల బండ్లతో పాటు ట్రాక్టర్‌లోనూ ఇసుకను తీసుకుని వెళ్లేందుకు అనుమతి నిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక అవసరాలకు మాత్రమే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని సవరణ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఇసుకపై సీనరేజ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని సీఎం వెల్లడించారు. టీటీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల గృహ నిర్మాణ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోడింగ్, రవాణా ఖర్చులతోనే ఇసుక తరలించుకునే వెసులుబాటు గృహ నిర్మాణదారులకు కలుగుతుంది. దీంతో ఇకపై ఇసుక ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు.    


More Telugu News