అమరావతిలో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్... భారీగా ఏర్పాట్లు

  • అమరావతిలో ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్
  • డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష
  • 22 సాయంత్రం విజయవాడ కృష్ణాతీరంలో భారీ డ్రోన్ షో
ఈనెల 22, 23 తేదీలలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల సెక్రెటరీలు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ .. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమన్వయంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. 

రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ సమ్మిట్‌ను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులు సదస్సు ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రోన్ సమ్మిట్‌లో వ్యవసాయ, ఆరోగ్య, లాజిస్టిక్ రంగాల్లో డ్రోన్ల వినియోగం, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డులు, డిజిటల్ లాండ్ రికార్డుల తయారీలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయని తెలిపారు. డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ పార్క్ వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 5వేల డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షోను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 

ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సహా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, పలువురు రాష్ట్ర మంత్రులు, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఐ అండ్ ఐ కార్యదర్శి సురేశ్ కుమార్ మాట్లాడుతూ .. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ డ్రోన్ సమ్మిట్ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్రోన్ సమ్మిట్‌కు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సీఎస్ కు వివరించారు. 


More Telugu News