147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భార‌త జ‌ట్టు పేరిట అరుదైన రికార్డు!

  • ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్
  • ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ (89 సిక్సులు) పేరిట‌
  • 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అయినా ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి
ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా శుక్రవారం ఈ సంచలన ఫీట్ సాధించింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టు అయినా ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి. 

అంతకుముందు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2022లో ఇంగ్లండ్ జ‌ట్టు 89 సిక్స్‌లు కొట్టింది. ఇక టీమిండియా ఆట‌గాళ్ల‌లో యువ సంచ‌ల‌నం యశస్వి జైస్వాల్ ఈ ఏడాది టెస్ట్‌లో ఏకంగా 29 సిక్సర్లు కొట్టడం విశేషం. అలాగే మ‌రో స్టార్ బ్యాట‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 16 సిక్సర్లు బాదాడు.

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సిక్సర్లు కొట్టిన జట్లు
102* – భార‌త్‌ (2024)
89 – ఇంగ్లండ్ (2022)
87 – భార‌త్‌ (2021)
81 – న్యూజిలాండ్ (2014)
71 – న్యూజిలాండ్ (2013)


ఇక బెంగ‌ళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 46 ర‌న్స్‌కే ఆలౌట్ అయినా భార‌త్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. విరాట్ కోహ్లి (70), రోహిత్ శర్మ (52), సర్ఫరాజ్ ఖాన్ (70 నాటౌట్‌) త్రయం అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అంత‌కుముందు కివీస్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 402 ప‌రుగులు చేసింది. రచిన్ రవీంద్ర (134), టిమ్ సౌథీ (63) ద్వ‌యం ఎనిమిదో వికెట్‌కు జోడించిన విలువైన 134 పరుగుల భాగ‌స్వామ్యం కార‌ణంగా న్యూజిలాండ్ 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ప్ర‌స్తుతం రోహిత్ సేన ఇంకా 125 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉంది. 


More Telugu News