తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్

  • విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం
  • కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించిందన్న నాదెండ్ల
  • ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతోందని వెల్లడి
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు వంట నూనె దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ సివిల్ సప్లయ్స్ భవనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని తెలిపారు. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 

అందులో భాగంగా పామాయిల్ లీటరు రూ.110... సన్‌ప్లవర్ ఆయిల్ రూ.124కే ప్రజలకు అందుబాటులో ఉంచామని నాదెండ్ల వివరించారు. ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. దీంతో దిగుమతి దారులు నుంచి ఇబ్బందులు లేకుండా సప్లయ్ పెంచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లయ్ పెంచాలని, అదే సమయంలో సకాలంలో సప్లయ్ అందించాలని కోరామని వెల్లడించారు. 

 కందిపప్పు సరఫరాదారులను నిలదీసిన మంత్రి

కందిపప్పు సరఫరాదారులతోనూ మంత్రి నాదెండ్ల సమావేశం నిర్వహించారు. మార్కెట్ ధరలకు కందిపప్పు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలపై పేద ప్రజలకు కందిపప్పు సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి సరఫరా దారులు సహకరించక పోవడాన్ని మంత్రి నాదెండ్ల అసహనం వ్యక్తం చేశారు. 

టెండర్ లో పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేయాలని, అదే విధంగా నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయకపోతే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ సబ్సిడీ పై కందిపప్పు అందించాలనే ఆశయంతో పనిచేస్తుందని అందుకు అందరూ సహకరించాలన్నారు. కందిపప్పు సరఫరా  చేయడానికి ఇబ్బందులు ఉంటే తెలపాలన్నారు. కందిపప్పు సరఫరా విషయంలో జరిగిన జాప్యంపై సరఫరా దారులు చెప్పిన అంశాలను మంత్రి నాదెండ్ల తోసిపుచ్చారు. 


More Telugu News