1,350 రోజుల నిరీక్ష‌ణ‌కు తెర.. ఎట్ట‌కేల‌కు సొంత‌గ‌డ్డ‌పై పాక్‌కు విజ‌యం

  • ముల్తాన్ వేదిక‌గా ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య రెండో టెస్టు
  • 152 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాక్‌
  • చివ‌రిసారిగా 2021లో స్వ‌దేశంలో సౌతాఫ్రికాపై పాక్ టెస్టులో విక్ట‌రీ
  • అలాగే సొంత‌గ‌డ్డ‌పై వ‌రుస‌గా 11 ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు కూడా ముగింపు
సొంత గ‌డ్డ‌పై వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాకిస్థాన్‌కు ఎట్ట‌కేల‌కు ఓ విజ‌యం ద‌క్కింది. ఇంగ్లండ్‌తో ముల్తాన్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో ఆతిథ్య జ‌ట్టు విజ‌యం సాధించింది. ఇంగ్లండ్‌ను 152 ప‌రుగుల తేడాతో ఓడించింది. 

297 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 144 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దాంతో పాక్‌ 152 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. స్పిన్న‌ర్లు నొమ‌న్ అలీ, సాజిద్ ఖాన్ ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించారు. నొమ‌న్ 8 వికెట్లు తీస్తే, సాజిద్ ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇలా ఈ ఇద్ద‌రే ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించారు. 

ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో సార‌థి బెన్ స్టోక్స్ 37 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ కాగా, మిగ‌తా బ్యాట‌ర్లు స్వ‌ల్ప స్కోర్ల‌కే పెవిలియ‌న్ చేరారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 366 ప‌రుగులు చేయ‌గా... ఇంగ్లండ్ 291 ర‌న్స్ చేసింది. దాంతో ఆతిథ్య జ‌ట్టుకు 75 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. 

అనంత‌రం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 221 ప‌రుగులు చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 75 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని ఇంగ్లండ్ ముందు 297 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. కానీ, ప‌ర్యాట‌క జ‌ట్టు కేవ‌లం 144 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

ఇక ఈ విజ‌యంతో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మొద‌టి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 48 ప‌ర‌గుల తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. రెండో టెస్టులో మాత్రం దాయాది జ‌ట్టు అద్భుతంగా పుంజుకుని మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది.  

ప్ర‌ధానంగా ఆ జ‌ట్టు ఇద్ద‌రు స్పిన్న‌ర్లు అమోఘంగా రాణించారు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి ఏకంగా 20 వికెట్లు ప‌డ‌గొట్టారు. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు ప‌డ‌గొట్టిన సాజిద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. అలాగే నొమ‌న్ అలీ మొద‌టి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు ప‌డగొట్టాడు. ఇంగ్లండ్ జ‌ట్టును ఇద్ద‌రు స్పిన్న‌ర్లే క‌ళ్లెం వేయ‌డం అనేది 1987 త‌ర్వాత ఇదే తొలిసారి. అలాగే టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇద్ద‌రూ బౌల‌ర్లే 20 వికెట్లు ప‌డ‌గొట్టడం ఇది ఏడోసారి. 

1,350 రోజుల నిరీక్ష‌ణ‌కు తె

పాక్‌కు సొంత గ‌డ్డ‌పై విజ‌యం ద‌క్కి 1,350 రోజులు అవుతోంది. చివ‌రిసారిగా 2021లో సౌతాఫ్రికాపై పాక్ టెస్టులో విక్ట‌రీ న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ఒక్క‌సారి కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై విజ‌యంతో ఆ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరదించిన‌ట్లైంది. అలాగే స్వ‌దేశంలో వ‌రుస‌గా 11 ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు కూడా ముగింపు ప‌లికింది. 


More Telugu News